శ్రీవారి ఆలయం మూసివేత వెనుక కుట్ర ఉందా?

17 Jul, 2018 03:39 IST|Sakshi
గంగా నదీ తీరంలో పూజలు చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి

     సీసీ కెమెరాలు ఆపడం ఎందుకు?

     విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి

పెందుర్తి: మహా సంప్రోక్షణ పేరుతో ఆగస్టు 9 నుంచి 16 వరకు ఆలయాన్ని మూసేస్తామన్న టీటీడీ నిర్ణయంలో కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా? అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అనుమానం వ్యక్తం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం మహా సంప్రోక్షణ జరిగే విధానాన్ని భక్తులంతా తిలకిస్తారని.. కానీ ఆ సమయంలో సీసీ కెమెరాలను సైతం ఆపివేస్తామంటూ టీటీడీ ప్రకటించడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. చాతుర్మాస దీక్ష నిమిత్తం రుషికేష్‌ పర్యటనలో ఉన్న స్వరూపానందేంద్ర స్వామి టీటీడీ నిర్ణయంపై స్పందిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టీటీడీ పాలకమండలి, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆలయం మూసివేత నిర్ణయం తీసుకునే ముందు.. శృంగేరి, కంచి వంటి పీఠాలతో గానీ, ఆగమ పండితులతో గానీ సంప్రదింపులు జరిపారా అని ప్రశ్నించారు. వైఖానస ఆగమం ఏం చెబుతుందో పాలక మండలి తెలుసుకొని ఉంటే బాగుండేదన్నారు. తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలన్నీ భక్తుల్లో అనుమానాలు పెంచుతున్నాయన్నారు. అసలు వారం పాటు సీసీ కెమెరాలను నిలుపుదల చేయాల్సిన అవసరమేమిటో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆలయం మూసివేతపై ఆగమ పండితులను గానీ పీఠాధిపతులను గానీ సంప్రదించి.. వారి సూచన మేరకు నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీటీడీ, ప్రభుత్వంపై ఉందన్నారు.

మరిన్ని వార్తలు