తెలుగు రాష్ట్రాల మేలు కోసమే యాగం

31 Jan, 2020 05:42 IST|Sakshi
గోపూజ చేస్తున్న స్వరూపానందేంద్ర స్వామీజీ , ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర, టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి దంపతులు

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ

శారదా పీఠం వార్షికోత్సవాలకు అంకురార్పణ

పెందుర్తి: తెలుగు రాష్ట్రాల మేలు కోసమే శారదాపీఠంలో యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నామని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చెప్పారు. దేవదేవుడు శ్రీనివాసుడి ఆశీస్సులు దేశానికి ఉండాలన్న సంకల్పంతో పీఠం వార్షికోత్సవాల్లో శ్రీనివాస చతుర్వేద హవనం చేపట్టినట్లు తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీల చేతుల మీదుగా అంకురార్పణ జరిగింది.

టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస చతుర్వేద హవనంతో పాటు రాజశ్యామల యాగం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి దంపతులు యాగానికి సంకల్పం గావించారు. టీటీడీ శ్రీ వేంకటేశ్వర వేదాధ్యయన సంస్థకు చెందిన వేద పండితులు యాగాన్ని నడిపించారు. భక్తులనుద్దేశించి స్వరూపానందేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణం చేశారు. కార్యక్రమంలో ఒడిశా అసెంబ్లీ స్పీకర్‌ పాత్రో, రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అదీప్‌రాజ్, తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు