ధర్మమే స్వరం..హైందవమే సర్వం

31 Oct, 2019 09:34 IST|Sakshi
ఉత్తరపీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీకి వేదసారం వివరిస్తున్న స్వామీజీ

హిందూధర్మ పరిరక్షణ కోసం సదా ధ్యానం

సేవాకార్యక్రమాలకు సర్వోన్నత ప్రాధాన్యం

ధార్మికత, సేవాతత్పరత లక్ష్యాలుగా ఉత్కృష్ట జీవనం

నేడు స్వరూపానందేంద్ర స్వామి జన్మదినోత్సవం

హిందూధర్మ పరిరక్షణదినోత్సవంగా నిర్వహణ

వేదభూమిగా పేరుపడ్డ భరతావనిలో ఎందరో మహిమాన్వితులు.. మరెందరో దివ్య చరితులు. చరిత్ర సైతం ఎరగని కాలంలో శంకరాచార్యుడి నుంచి.. ఇప్పటి విజయేంద్ర సరస్వతి వరకు.. హైందవతత్వాన్ని.. ఆర్ష ధర్మాన్ని కాపాడేందుకు అవతరించిన మహనీయులు.. మహోన్నత పరంపరకు ప్రతీకలు. దేశం వివిధ ప్రాంతాల్లో వెలసిన వివిధ పీఠాలకు ఎందరో అధిపతులు.. ఇంకెందరో పరివ్రాజకులు. అందరి కర్తవ్యం సనాతన ధర్మ సంరక్షణమే. అందరి విధి.. హిమవన్నగ సమాన నమున్నతమైన హైందవ ఔన్నత్య పరిరక్షణమే. ఈ బాధ్యతను  అపూర్వరీతిలో శిరసున ధరించి సంరక్షిస్తున్న వారిలో అగ్రగామి విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. విద్యావాచస్పతిగా.. వివేకంలో బృహస్పతిగా ఎన్నదగ్గ ఈ మహాస్వామి.. హైందవ ధర్మానికి హాని.. గ్లాని కలిగే సందర్భాలలో ఎదురొడ్డి పోరాడే ధర్మ యోథుడిగా వన్నెకెక్కారు. భరతావనిలో ఏమూల హిందూ ధర్మానికి చేటు చేకూరే ప్రమాదం సంభవించినా.. ముందుగా శంఖారావం పూరించే చైతన్య స్వరూపంగా గుర్తింపు పొందారు. అంతేకాదు.. శారదామాత చల్లని దృక్కులను దీనులపై సమానంగా ప్రసరింపజేసే వాహికగా మతాన్ని వినియోగించే సహృదయశీలిగా పదిమంది ప్రశంసలకు పాత్రులవుతున్నారు. ఆధ్యాత్మికతకు ఆలవాలంగా, ధార్మికతకు ప్రతి బింబంగా, సేవాభావానికి నిలువెత్తు నిదర్శనంగా గుర్తింపు పొందినా.. అంతులేని వినమ్రతకు ప్రతీకగా సార్థక జీవితం గడుపుతున్న స్వరూపానందేంద్ర మహాస్వామి నాగులచవితి పర్వదినాన తన జన్మదినాన్ని జరుపుకోనున్నారు. 

పెందుర్తి: హైందవ ధర్మానికి ఎక్కడ ఏమాత్రం ప్రతికూలత ఎదురైనా ఆయన దండంతో కదను తొక్కుతారు. దేశంలో ఎక్కడ.. ఎవరి వల్ల ఆర్ష ధర్మానికి ఆపద వాటిల్లినా నిర్ద్వంద్వంగా.. నిర్మొహమాటంగా వాదనకు సంసిద్ధులవుతారు. అవతలివారు ఎవరన్నది లక్ష్యపెట్టకుండా.. జరుగుతున్న అన్యాయాన్ని పదాలకోసం తడుముకోకుండా ధ్వజమెత్తుతారు. ఇలా సనాతన ధర్మ సంరక్షణకు కంకణబద్ధుడైన పీఠాధిపతిగా విశాఖశ్రీశారదాపీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామీజీ వన్నెకెక్కారు.  సమాజానికి దూరంగా.. ఆచారాల గురించి అవగాహన లేక అమాయకంగా బతికే గిరి పుత్రులను హైందవ ధర్మ ఛత్రం పరిధిలోకి తెచ్చి.. వారికీ హైందవ ధర్మజలాలు అందించిన సంస్కారవంతుడిగా గుర్తింపు పొందిన విశిష్ట వ్యక్తిత్వమూ ఆయనదే.  మరోవైపు లోకకల్యాణం కోసం అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు శారదాపీఠాధిపతి. సమకాలిన సమాజంలో పోరాటానికి ధైర్యం, ఆర్ష ధర్మ రక్షణకు అపారజ్ఞానం, దేశంపై అలవిమాలిన అభిమానం కలగలిసిన మఠాధిపతుల్లో స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అగ్రస్థానంలో నిలుస్తారు. దేశభద్రత, రైతుల సంక్షేమం, ప్రజల సుఖసంతోషాలు కోరుతూ నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న పరివ్రాజకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఇటు ధార్మికాన్ని ..అటు సామాజికాన్ని సమతూకంగా చూస్తూ ఆధ్యాత్మికతతో పాటు సేవా కార్యక్రమాలను కూడా ఏకకాలంలో సమాజంలో నిర్వహిస్తున్న స్వామీజీ జన్మదినం నాగులచవితి రోజున సంభవించడంతో.. ఈ సందర్భంగా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠంలో స్వామీజీ జన్మదిన వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హిందూధర్మ పరిరక్షణ దినోత్సవంగా స్వామీజీ జన్మదినోత్సవాన్ని పరిగణిస్తున్నారు.

మత రక్షణకు ఉద్యమ పథం
తిరుపతి సమీపంలో ఇస్లామిక్‌ యూనివర్శిటీ నిర్మాణం చేపట్టే ప్రతిపాదనపై స్వామీజీ తీవ్రస్థాయిలో ఉద్యమానికి తెరతీశారు.  తిరుమలతో పాటు దేశంలోని పవిత్ర హిందూ దేవాలయాల వద్ద ఎటువంటి అన్యమత ప్రచారం జరిగినా, దేవాలయాలకు ఏ హాని జరిగినా స్వామీజీ సహించరు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన కొద్ది రోజులకే విజయవాడలో టీడీపీ ప్రభుత్వహయాంలో పదుల సంఖ్యలో దేవాలయాలను రోడ్డు విస్తరణ పేరుతో రాత్రికి రాత్రే కూల్చేయడాన్ని స్వామీజీ అత్యంత హేయమైన చర్యగా ఆక్షేపించారు. అభివృద్ధి పేరుతో దేవాలయాలను కూల్చేస్తారా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. పుష్కరాల సమయంలో ఎందరో భక్తులు మరణించడం పట్ల స్వామీజీ తీవ్రంగా కలత చెందారు. ఇంతటి ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ఎక్కడా చూడలేదని తీవ్రస్థాయిలో ఆవేదన వెలిబుచ్చారు.

సేవలో స్ఫూర్తిదాయకం
ఐదేళ్ళ క్రితం హుద్‌హుద్‌ తుపాను కారణంగా విశాఖ అతలాకుతలం కావడంతో స్వామీజీ కలతకు గురయ్యారు. తక్షణమే తన శిష్య పరివారాన్ని రంగంలోకి దించి జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి బియ్యం, వస్త్రాలు, నిత్యవసరాలు అందజేశారు. వందలాది మంది బాలలకు వేదం, స్మార్థం ఉచితంగా బోధింపజేస్తూ సమాజానికి ఉపకారం చేస్తున్నారు.  గిరిజన ప్రాంత రైతులకు ఉచితంగా ఆవులు, ఎద్దులను వితరణ గావిస్తున్నారు. 2012లో పీఠం ఆధ్వర్యంలో 500 మంది గిరిజనులను తిరుమల పంపించి వెంకన్న దర్శనం చేయించారు. ఏటా ఏదో ఒక సందర్భంలో పేదల కోసం సేవా కార్యక్రమాలు చేపడతారు. తన ప్రతి జన్మదినోత్సవం నాడు వేలాది మంది ప్రజలకు వస్త్రదానం చేస్తారు. పీఠంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే వేదపండితులను ఘనంగా సత్కరిస్తారు.

పాదయాత్రకు అంకితం
స్వరూపానందేంద్ర సరస్వతి తొలిసారి 1994లో ఋషీకేష్, కేదార్‌నా«థ్, బదరీనా«థ్‌లలో పాదయాత్ర చేశారు. 1995లో ఋషీకేష్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి వరకు దాదాపు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 1996లో కర్ణాటకలోని అద్వైతానందేంద్ర సరస్వతి స్వామీజీ వద్ద సన్యాసం స్వీకరించి స్వామీజీ యోగపట్టా పొందారు. స్వామీజీ పరమ గురువు సచ్చిదానందేంద్ర మహాస్వామి.
శారదాపీఠానికి తిరుపతి, శ్రీశైలంలతో పాటు ఋషికేష్, వారణాశిలో అనుబంధ పీఠాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో దైవసన్నిధానంతో పాటు రాష్ట్రంలోని అనేక దేవాలయాలు పీఠం ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి.

 పీఠంలో గురువారంకార్యక్రమాలు
ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం
ఉదయం 9 గంటలకు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకాలు
9.45 గంటలకు రుద్రాక్రమార్చన
10 గంటలకు అవహంతి హోమం, అయుష్య హోమం
10.30 గంటలకు పాదపూజ, భిక్షావందనం
11.30 మహాపూర్ణాహుతి
మధ్యాహ్నం 11.45 నుంచి  అన్నదానం.
సాయంత్రం 4 గంటలకు సామూహిక లలిత, విష్ణు సహస్ర పారాయణం
4.30 నుంచి గంటలకు స్వామీజీ అనుగ్రహ భాషణం
వేడుకల్లో స్వామీజీ చేతుల మీదుగా పేదలకు వస్త్రదానం
గవర్నర్‌ హరిచందన్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.

లోక కల్యాణమే లక్ష్యం
చినముషిడివాడలోని శారదాపీఠంతో పాటు తిరుపతి, శ్రీశైలం, హైదరాబాద్, రుషీకేష్, హరిద్వార్‌లలోని శారదాపీఠం శాఖల్లో నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయి. ఏటా పీఠం వార్షికోత్సవాలు మూడు రోజుల పాటు.. పదకొండేళ్లుగా అతిరుద్ర లక్ష చండీయాగం ఐదు రోజుల పాటు.. ఇతర హోమాలు, యజ్ఞాలు స్వామీజీ నేత్రత్వంలో జరుగుతాయి. తాజాగా ఐదు రోజులపాటు పీఠంలో అతిరుద్ర చండీయాగం వైభవంగా నిర్వహించారు. దైవ కృప కోసం ఎన్ని కార్యక్రమాలు చేసినా అంతిమంగా లోకకల్యాణం జరగాలన్నదే తన ఆకాంక్ష అంటూ స్వామీజీ సెలవిస్తారు.

నేడు గవర్నర్‌ రాక
రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ గురువారం నగరానికి రానున్నారు. ఆయన ఉదయం 10.50కి  విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి సాలూరుకు వెళతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరిగి విశాఖ చేరుకుని చినముషిడివాడలొని శారదాపీఠానికి వెళ్తారు. రాత్రి 7.25 గంటలకు ప్రత్యేక విమానం ద్వారా గన్నవరం వెళ్తారు..

వేడుకలకు మంత్రులు రాక..
స్వరూపానందేంద్ర పుట్టిన రోజు వేడుకులలో రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా