దిశ చట్టం ఓ మైలురాయి దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిందే

15 Dec, 2019 02:56 IST|Sakshi

ప్రధాని మోదీకి ఢిల్లీ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ లేఖ

మహిళలపై నేరాలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టేలా ఏపీ సర్కార్‌ చట్టం

నేరాల నియంత్రణకు దిశ చట్టం ఓ అస్త్రంలా పనిచేస్తుంది

దోషులకు శిక్షతో బాధితులకు సత్వర న్యాయం చేకూర్చే చుక్కాని ఆ చట్టం

అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించే చర్యలు తీసుకోవాలి

అప్పటిదాకా నిరవధిక నిరాహార దీక్ష విరమించే ప్రసక్తే లేదు

సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ: మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడే వారిని సత్వరమే శిక్షించేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన ‘దిశ’ చట్టం ఒక మైలు రాయిగా నిలుస్తుందని.. ఆ చట్టాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ఢిల్లీ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ శనివారం లేఖ రాశారు. మహిళలపై నేరాలకు పాల్పడే దుస్సాహసానికి ఒడిగట్టాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా దిశ చట్టాన్ని రూపొందించారని, ఇది నేరాల నియంత్రణకు అస్త్రంగా పని చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. దేశంలో మహిళలు, పిల్లలపై జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడే వారిని సత్వరమే కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో ఢిల్లీలో ఆమె చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శనివారానికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె ప్రధానికి లేఖ రాశారు. ఆ లేఖలో ఇంకా ఏముందంటే..

మహిళల హక్కుల పరిరక్షణపై శ్రద్ధ ఏదీ?
‘దేశంలో మహిళలు, పసిపిల్లలపై వేధింపులతో పాటు అత్యాచారాలు, అఘాయిత్యాలు, గ్యాంగ్‌ రేప్‌లు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ కేసుల్లో దోషులను తక్షణమే శిక్షించడంతో పాటు భవిష్యత్‌లో ఇలాంటి నేరాలు చోటు చేసుకోకుండా కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని కొన్ని వారాలుగా దేశ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు భారీ ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు గానీ, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడకుండా అడ్డుకట్ట వేసేలా చట్టాన్ని తేవడంలో మాత్రం ప్రభుత్వం విఫలమవుతోంది. పార్లమెంట్‌లో ప్రజా ప్రతినిధులు అనవసరమైన విషయాలతో సమయాన్ని వృథా చేస్తున్నారు తప్ప మహిళల హక్కులను పరిరక్షించడంపై చర్చించడం లేదు. ఇదే సమయంలో మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో భాగంగా ఐపీసీ (ఇండియన్‌ పీనల్‌ కోడ్‌), పోస్కో యాక్ట్, కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌కు పలు సవరణలు చేసింది. అవేమంటే..

►మహిళలపై అత్యాచారం చేసినా, గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడినా, పసిపిల్లలపై అత్యాచారం చేసినా, యాసిడ్‌ దాడులకు పాల్పడినా మరణ శిక్ష విధించేలా ఐపీసీ, పోస్కో చట్టానికి సవరణ.
►మహిళలపై నేరాలకు పాల్పడే వారిని తక్షణమే శిక్షించేలా కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌కు సవరణ చేసింది. ఈ సవరణ ప్రకారం సంఘటన జరిగిన వారం రోజుల్లోగా పోలీసులు విచారణ పూర్తి చేయాలి. ఆ తర్వాత 14 రోజుల్లోగా కోర్టుల్లో ట్రయల్స్‌ పూర్తి చేసి 21 పని దినాల్లో తీర్పు ఇవ్వాలి. ఈ తీర్పుపై అప్పీల్‌లు, రివిజన్‌ పిటిషన్‌లపై విచారణను మూణ్నెళ్లలోగా పూర్తి చేయాలి.
►మహిళలపై నేరాలకు పాల్పడే కేసుల విచారణకు జిల్లాకు ఒక ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు. వాటిలో ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లుగా మహిళలను నియమించాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. ఈ కేసుల విచారణకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం.
►ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన దిశ చట్టం చరిత్రాత్మకమైనది. దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట వేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఈ చట్టాన్ని దేశ వ్యాప్తంగా ఎందుకు అమలు చేయరు?
► దోషులకు తక్షణమే శిక్ష పడేలా, బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చేయడానికి దిశ చట్టం చుక్కానిలా నిలుస్తుంది.
►ఇప్పటికి నేను నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి 12 రోజులు పూర్తయింది. మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేయడానికి దేశ వ్యాప్తంగా దిశ చట్టాన్ని అమలు చేసే వరకు దీక్ష విరమించను. దేశంలోని మహిళలు, పసిపిల్లల హక్కులను పరి రక్షించడం కోసం దిశ చట్టాన్ని దేశమంతటా అమలు చేస్తారని ఆశిస్తున్నాను’ అని ఆమె వివరించింది.  

మరిన్ని వార్తలు