ఎందుకంత ప్రేమ

27 Sep, 2015 00:17 IST|Sakshi

 జిల్లాలో కళాకారులకు కొదవలేదు. వారు చేస్తున్న కళాసేవా తక్కువేమీ కాదు... వారికి జిల్లా అధికారులనుంచి లభ్యమవుతున్న ఆదరణ అంతంతమాత్రమే. ప్రభుత్వ పరంగా సెంటు స్థలమైనా ఎవరికీ ఇవ్వలేదు. ఇక్కడ పుట్టినా... ఎక్కడో స్థిరపడి... పూర్తిగా జిల్లాకు దూరమైన ఓ కళాకారిణికి అనూహ్యంగా విలువైన భూమిని కళాగురుకులం కోసం కేటాయించడం చర్చనీయాంశమైంది. తాత్కాలికంగా శిక్షణ తరగతులు నిర్వహించేందుకు అంతకుముందు వేరొకరికి ఇచ్చిన అనుమతిని సైతం రద్దు చేసి ఈమెకు అప్పగించడం మరీ విమర్శలకు తావిస్తోంది.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :స్వాతి సోమనాథ్... గొప్ప అంతర్జాతీయ నృత్య కళాకారిణి. ఆమె పద సవ్వడులతో దేశవిదేశాల్లోని రంగస్థలాలు మార్మోగాయి. ఆమె హావభావాలు కళాభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. ఆమె స్వస్థలం దూసి. అదే మన జిల్లాకు గర్వకారణమైంది. కానీ ఇన్నాళ్లు ఆమె శ్రీకాకుళం జిల్లాకు చేసిందేమీ లేదు. ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చినా... పారితోషికం విషయంలో రాజీపడిందీ లేదు. కానీ అనుకోకుండా ఆమెకు జిల్లాపై ఇప్పుడు మమకారం పెరిగింది. ఈ జిల్లాలోని ఔత్సాహిక కళాకారులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం కళాగురుకులాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఓ దరఖాస్తు చేసుకోవడం... ప్రభుత్వ పెద్దలు పావులు కదపడం... జిల్లా యంత్రాంగం ఆమెకు శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లిలో 13ఎకరాల భూమిని అప్పగించేయడం చకచకా సాగిపోయాయి.
 
 జిల్లాలో కళాకారులకు ఏమిచ్చారు?
 జిల్లాలోనే ఉండి... ఇక్కడే కళాప్రదర్శనలు ఇచ్చి.. ఇక్కడి ప్రజలను రంజింపజేసిన కళాకారులు ఎంతోమంది ఉన్నారు. జిల్లా పాలనా యంత్రాంగం తమ అవసరాలకోసం అప్పుడప్పుడు వారిని వాడుకుంటూండేది. కానీ వారిని ప్రోత్సహించేందుకు కనీసం సెంటు భూమైనా ఇవ్వలేదు. అందుకోసం వారు చేసుకున్న దరఖాస్తులనూ పట్టించుకోలేదు. కానీ స్వాతి సోమనాథ్‌కు భూమినివ్వడం ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది.
 
 తాత్కాలిక శిక్షణకు కేంద్రం కేటాయింపులోనూ వివక్ష
 గురుకుల నిర్మాణం పూర్తయినంతవరకూ తాత్కాలికంగా శిక్షణ తరగతులు నిర్వహించుకునేందుకు తొలుత డచ్‌భవనాన్ని అందించారు. అందులో శిక్షణ ప్రారంభ సూచికగా ఆగస్టు 15వ తేదీన జిల్లామంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఏమయిందో ఏమో ఇప్పుడు పీఎస్‌ఎన్‌ఎం స్కూల్ ఆవరణలో తరగతులు నిర్వహించేందుకు అనుమతిచ్చారు. వాస్తవానికి అదే పాఠశాల ఆవరణలో పట్టణానికి చెందిన శివశ్రీ నృత్యకళానికేతన్ డ్యాన్స్ స్కూల్ యజమాని ఆర్.శ్రీకాంత్ శిక్షణ తరగతులు నిర్వహించుకునేందుకు వీలుగా మునిసిపల్ అధికారులు గత ఆగస్టులో రెండు తరగతి గదుల్ని నామమాత్రపు అద్దెకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే అధికారులు ఆగ మేఘాలమీద ఆ ఉత్తర్వుల్ని కాదని స్వాతి సోమనాథ్ సహా మరో ఇద్దరు అదే పాఠశాలలో క్లాసులు నిర్వహించుకునేందుకు అనుమతివ్వడం వివాదానికి కారణమైంది.

 జిల్లాలో ఉన్నవారికి అర్హత లేదా?
 జిల్లాలో సుమారు 20మంది నృత్య శిక్షకులు ఉన్నారు. ఏళ్ల తరబడి కళనే నమ్ముకుని వారు బతుకుతున్నారు. తమకు ఎక్కడైనా స్థలం కేటాయించాలని పలువురు కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌లో కొందరు అర్జీ కూడా పెట్టుకున్నారు. వారిని కాదని స్వాతి సోమనాథ్‌కు జిల్లా యంత్రాంగం అధిక ప్రాధాన్యమివ్వడాన్ని తోటి కళాకారులు తప్పుబడుతున్నారు.
 
 ఇది పూర్తిగా కళాసేవకే...
 అయితే తాను మాత్రం జిల్లా యంత్రాంగానికి సహకరిస్తున్నానని, కళా గురుకులానికి సంబంధించి లావాదేవీలన్నీ ప్రభుత్వమే పర్యవేక్షిస్తోందని స్వాతి సోమనాథ్ అప్పట్లో వివరణ ఇచ్చుకున్నారు. తన స్వార్థం కోసం భూ కేటాయింపు వాస్తవం కాదని, దూసి ప్రాంతానికి చెందిన తాను ఇతర ప్రాంతంలో స్థిరపడినప్పటికీ చాలా మందికి సంప్రదాయ నృత్య కళల్లో శిక్షణ నిచ్చానని తెలియజేశారు. కళా గురుకులానికి తానేమీ డెరైక్టర్‌గా గానీ, ప్రిన్సిపాల్‌గా కూడా వ్యవహరించడం లేదని చెబుతున్నారు.
 
 

మరిన్ని వార్తలు