ప్రమాణ స్వీకారానికి జూన్ 2 వరకు ఆగాల్సిందే..

9 May, 2014 10:11 IST|Sakshi
ప్రమాణ స్వీకారానికి జూన్ 2 వరకు ఆగాల్సిందే..

సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16వ తేదీనే రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడుతున్నప్పటికీ.. తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసేందుకు జూన్ 2వ తేదీ వరకు ఆగాల్సిందే. అపాయింటెడ్ డే అయిన జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్నందున ఆ రోజు గానీ, ఆ తర్వాత ఎప్పుడైనా గానీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేయవచ్చు.

ఆ తేదీకంటే ముందు ప్రమాణ స్వీకారాలకు మాత్రం అవకాశం లేదు. గవర్నర్ నరసింహన్  రెండు రాష్ట్రాల సీఎంలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇందుకు సంబంధించి గవర్నర్ ప్రాథమికంగా సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ జూన్ 2వ తేదీనే (ఆరోజు పంచమి మంచిదని భావించి) ప్రమాణ స్వీకారం చేయాలనే నిబంధన ఏదీ లేదు.

 

తాము ఎప్పుడు కావాలనుకుంటే ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయవచ్చు. జూన్ 2వ తేదీన ఇద్దరూ హైదరాబాద్‌లోనే ప్రమాణ స్వీకారం చేయూలని నిర్ణరుుంచుకుంటే ఎలాంటి ఆటంకం ఉండదు. కానీ అదేరోజు సీమాంధ్ర ముఖ్యమంత్రి  సీమాంధ్రలో, తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో ఒకే సమయంలో ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకుంటే మాత్రం సాధ్యం కాదని అంటున్నారు. జూన్ 2వ తేదీ ఉదయం ఒకరు, సాయంత్రం మరొకరు ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటే ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.

ఈ మేరకు గవర్నర్ కోసం ఒక హెలికాప్టర్‌ను కూడా అధికారులు అందుబాటులో ఉంచారు. ఇక జూన్ 2న కాకుండా వేర్వేరు తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయూలని నిర్ణరుుంచుకుంటే ఎటువంటి సమస్య తలెత్తదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తొలుత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులే ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా మొత్తం మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తుందా అనేది కూడా ఆయా ముఖ్యమంత్రుల అభీష్టం మేరకే ఉంటుంది. తెలంగాణ, సీమాంధ్రల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలు సాధించిన పార్టీలను ప్రభుత్వాల ఏర్పాటుకు గాను గవర్నర్ ఆహ్వానిస్తారు.


 

మరిన్ని వార్తలు