అక్కడ స్వీపర్లే నర్సులు..!

27 Jun, 2019 10:18 IST|Sakshi
రోగికి సెలైన్‌ పెడుతున్న పారిశుధ్య కార్మికురాలు

నర్సులు ఉన్నా.. కుర్చీలకే పరిమితం

రోగులకు నరకం

ఇదీ.. గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో దుస్థితి

సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో వైద్యం కోసం వచ్చే వారికి పారిశుధ్య విభాగంలో పనిచేసే స్వీపర్లే సేవలందించాల్సిన దుస్థితి ఏర్పడింది. వైద్యశాలలో నర్సులు ఉన్నప్పటికీ రోగులను పట్టించుకోకుండా కుర్చీల్లో కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకే పరిమితమవుతున్నారు. వైద్యశాలల్లో ఐదుగురు డాక్టర్లు ఉన్నారు. వారు రోగులను పరీక్షించి మందులు, ఇంజక్షన్లు రాస్తారు. డాక్టర్‌ రాసిచ్చిన మందులు ఇంజక్షన్లను రోగులకు ఇవ్వాల్సిన నర్సులు.. ఆ పనిని స్వీపర్లతో చేయిస్తున్నారు. వైద్యశాలలో సుమారు 15 మంది వరకూ నర్సులు ఉన్నప్పటికీ రోగులకు అరకొరగా కూడా వైద్యసేవలు అందించకుండా తీవ్రస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులకు ఇంజక్షన్లు వేయడం, సెలైన్‌లు పెట్టడం వంటి పనులన్నింటినీ పారిశుధ్య కార్మికులతోనే చేయిస్తున్నారు. దీనిపై రోగులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

స్వీపర్లు మరుగుదొడ్లు, వార్డులు శుభ్రపరచి అపరిశుభ్రమైన చేతులతో తమకు ఇంజక్షన్లు చేయడం, సెలైన్‌లు ఇవ్వడమేంటని ఆగ్రహిస్తున్నారు. అంతేగాకుండా ఎలాంటి శిక్షణ లేని స్వీపర్లు వైద్యసేవలు అందించడం వలన కొన్నిసార్లు రోగులు తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంజక్షన్లు చేసే సమయంలో తీవ్రంగా నొప్పి, సెలైన్లు ఎక్కించే సమయంలో రక్తస్రావం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. నర్సులు చేయాల్సిన పనులను స్వీపర్లతో చేయించడం ఏంటని ఆయా సమయాల్లో నర్సులను నిలదీస్తున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోందని, వారిలో ఏ విధమైన మార్పూ రావడం లేదని రోగులు, వారి బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గాయాలకు కట్లు కట్టేది.. కుట్లు వేసేది కూడా స్వీపర్లే...
రోడ్డు ప్రమాదాలు, తదితర సంఘటనల్లో గాయాలపాలై వైద్యశాలకు వచ్చిన క్షతగాత్రులకు కట్టుకట్టి వైద్యం చేయాల్సిన నర్సులు పట్టించుకోకపోవడంతో పాటు ఆ పనులను స్వీపర్లతో చేయిస్తున్నారు. గాయాలకు స్వీపర్లే డ్రస్సింగ్‌ చేసి కట్టు కడుతున్నారు. కొందరికి కుట్లు కూడా వారే వేస్తున్నారు. స్వీపర్లు వైద్యం అందించడంపై కొందరు రోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా.. ప్రమాద సమయంలో తప్పడం లేదని సర్దుకుపోతున్నారు. దీనిపై వైద్యశాల వైద్యులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రోగుల బంధువులు వాపోతున్నారు. డ్యూటీ డాక్టర్‌లైనా రోగులకు చేయి పట్టుకుని వైద్యం అందిస్తారుగానీ, నర్సులు మాత్రం రోగులను పట్టించుకోరన్న ఆరోపణలు ఈ వైద్యశాల నర్సులపై ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో నర్సులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు