తీపి గురుతులు.. దామోదరం జ్ఞాపకాలు

14 Feb, 2014 03:47 IST|Sakshi

కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: పెద్దపాడులో పుట్టి పెరిగిన దామోదరం సంజీవయ్య జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో మేటిగా నిలిచిపోయారు. కర్నూలు మునిసిపల్ మెయిన్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఆయన రాజకీయంగా వివిధ పదవులు అధిష్టించినా జన్మనిచ్చిన నేలతల్లి రుణం తీర్చుకునే ప్రయత్నం చేశారు.
 
 రైతు సంక్షేమం, నంద్యాల మునిసిపాలిటీలో మంచినీటి సరఫరా కోసం గాజులదిన్నె ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే దాని నిర్మాణం కోసం నిధులు విడుదల చేశారు. 7వ నంబర్ జాతీయ రహదారి నిర్మాణానికి పునాది రాయి వేసి కర్నూలును జాతీయ రహదారితో అనుసంధానించారు. నంద్యాల ప్రాంత విద్యార్థుల కోసం తొలిసారిగా పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయించారు.
 
 గురువులంటే మహా గౌరవం..: ప్యాలకుర్తిలోని అప్పటి కరణం వారి గృహంలో ఉండి ఆ ఊరి వీధిబడిలో అక్షరాభ్యాసం చేసిన సంజీవయ్యకు గురువులంటే మహా గౌరవం. రాజకీయంగా ఉన్నత పదవిలో ఉన్న సమయంలో కూడా తాను చదువుకున్న బడి, ఆడుకున్న కల్లం ప్రాంతాలను సందర్శించారు. చదువు చెప్పించిన కరణం వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా పలకరించారు. కర్నూలు మునిసిపల్ స్కూల్‌లో అప్పటి హెడ్‌మాస్టర్ పశుపతి అయ్యర్ సంజీవయ్యను బాగా ప్రోత్సహించారు.

అందుకు కృతజ్ఞతగా సీఎం అయిన తర్వాత కర్నూలు ఉత్తరాది మఠం దగ్గర ఉండే పశుపతి అయ్యర్ నివాసానికి వెళ్లి ఆయనను సత్కరించారు. ఆ సమయంలో కూడా పశుపతి అయ్యర్ ఒరేయ్ అని సంబోధిస్తూ ఆప్యాయంగా మాట్లాడితే సంజీవయ్య పులకించిపోయారు. కర్నూలులో అప్పటి సుప్రసిద్ధ సాహితీవేత్త ఎన్.వి.కృష్ణమూర్తి ఇంట్లో ఉండి ఆయన చదువుకునేవారు.
 
 ఉస్మానియా కళాశాలలో జువాలజీ విభాగాధిపతిగా పని చేసిన ఎన్‌వి.కృష్ణమూర్తి పట్ల సంజీవయ్యకు చాలా అభిమానం ఉండేది. ఆయనతో కలిసి పలు సాహితీ సభల్లో పాల్గొనేవారు. తానురాసే సాహితీ గ్రంథాల గురించి ఎన్.వి.కృష్ణమూర్తితో చర్చించేవారు.
 ఇప్పటి యుకాన్‌ప్లాజా ప్రాంతం సంజీవయ్య నివాసం.. : నగరంలోని యుకాన్ ప్లాజా ఉండే ప్రధాన కూడలిలో సంజీవయ్య ఇల్లు ఉండేది.
 
 ప్రకాశం పంతులు మంత్రివర్గంలో ఆయన ఆరోగ్యం, ప్లానింగ్ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు గృహంలో నివశిస్తూ అత్యంత సాదా సీదాగా జీవనం గడిపేవారు. తన సహచరులు, మంత్రులతోపాటు కర్నూలు పరిసర గ్రామాలు నాగులాపురం, పర్ల, ఉల్చాల, కోడుమూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలనుఆత్మీయంగా పలకరించేవారు. గృహం వద్దనే ప్రతి ఒక్కరితో కరచాలనం చేస్తూ ప్రేమగా పలకరించి పనులు చేసి పంపేవారు.
 
 దామోదరం ఉపన్యాసాలు అత్యంత ఆసక్తికరం..
 - చంద్రశేఖర కల్కూర, అధ్యక్షులు, గాడిచెర్ల ఫౌండేషన్, కర్నూలు
 దామోదరం సంజీవయ్య రాజకీయ వేత్త మాత్రమే కాదు గొప్ప సాహితీ వేత్త. ఆయన తన ప్రసంగాన్ని చిన్న చిన్న పదాలు, చక్కని సమాసాలతో మంచి టైమింగ్ మాడ్యులేషన్‌తో కొనసాగిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. నేను నంద్యాలలో ఒక సభలో ఆయన ఉపన్యాసం విన్నాను. రామాయణ, భారత గ్రంథాల్లోని పద్యాలను ఉదాహరణలుగా చెబుతూ వాటిని ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ ఆయన చాలా చక్కగా ఉపన్యసించారు.
 
 ఉస్మానియా కళాశాల సాహితీ సభలో విశ్వనాథ కవి ప్రశంస...:
  1964లో కర్నూలు ఉస్మానియా కళాశాలలో జరిగిన ఒక సాహితీ సభలో అప్పటి సుప్రసిద్ధ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పాల్గొన్నారు. ఆ సభకు దామోదరం సంజీవయ్య అధ్యక్షత వహించారు. విశ్వనాథ మాట్లాడుతూ రాజకీయ దురంధరులు, సాహితీ ప్రవీణులు అయిన సంజీవయ్య పాల్గొన్న సభలో ప్రసంగించడం తన అదృష్టంగా అభివర్ణించారు. సంజీవయ్య సాహితీ సభల్లో చక్కని చమక్కులు, పద్య గానంతో ప్రేక్షకులను ఆకట్టుకునేవారు.

పత్తికొండలో ఒక రాజకీయ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సభానంతరం అక్కడి స్థానిక జానపదులను పిలిపించి వాళ్లతో కర్నూలు మాండలికంలో జానపద గీతాలు పాడించుకుని ఆనందించారు. ఎన్నికల్లో ఓడిపోయాక ఓసారి నాగులాపురం సమీపంలోని పర్ల గ్రామాన్ని సందర్శించారు. అక్కడ బాల తిమ్మారెడ్డి అనే ఓ కళాకారుడు భారతంలోని సర్వం సర్వం సహచక్ర అనే పద్యం చెప్పగా దానిని తన ఓటమికి అన్వయించుకొని మహా మహులకే ఓ టమి తప్పలేదు. మనమెంత అంటూ సందర్భోచిత పద్యం చెప్పిన ఆయనను మెచ్చుకున్నారు.
 

మరిన్ని వార్తలు