ఈదరపల్లిలో మహిళకు స్వైన్‌ఫ్లూ

23 Oct, 2018 13:07 IST|Sakshi
ఈదరపల్లిలో స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకిన సత్యనారాయణమ్మ సత్యనారాయణమ్మకు స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకిందని రంగరాయ మెడికల్‌ కళాశాల ఇచ్చిన రిపోర్ట్‌

హెచ్‌–1 ఎన్‌–1 గా నిర్ధారించిన రంగరాయ మెడికల్‌ కళాశాల

కాకినాడలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స

అప్రమత్తమైన అధికార యంత్రాంగం కోనసీమలో తొలి కేసు నమోదు

తూర్పుగోదావరి, అమలాపురం రూరల్‌: ఈదరపల్లి గ్రామంలో ఓ మహిళకు స్వైన్‌ ఫ్లూ సోకింది. ఆ గ్రామం శివారు శ్రీరామనగర్‌ కాలనీకి  చెందిన తిరుమనా«థం వీర వెంకట సత్యనారాయణమ్మ (36) ఆ వ్యాధి లక్షణాలతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె కాకినాడలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స పొందుతోంది. ఆమె ఈనెల 11న జ్వరం, ఆయాసం, దగ్గు, రొంప లక్షణాలతో అమలాపురంలోని ఓ ఎమర్జెన్సీ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరింది. అక్కడ జ్వరం నయం కాకపోవవడంతో కాకినాడలోని కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ఆమెకు రక్త పరీక్షలు చేయగా స్వైన్‌ఫ్లూ జ్వరంగా తేలింది. ఈనెల 20న కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో కూడా ఆమెకు రక్త పరీక్షలు చేయించగా హెచ్‌1 ఎన్‌ 1తో స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. సత్యనారాయణమ్మ భర్త దుర్గారావు అమలాపురంలో నిమ్మకాయలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. వారికి 11 ఏళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు.

సత్యనారాయణమ్మ ఇంటి వద్దే పూల దుకాణాలకు పూలు దండలుగా గుచ్చే పనితో ఉపాధి పొందుతోంది. పేద కుటుంబమైన ఈమెకు ప్రమాదకరమైన వ్యాధి రావడంతో  వైద్యం కోసం ఇప్పటికే రూ. ఖర్చులు చేస్తున్నారు. స్వైన్‌ఫ్లూ కేసుతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అమలాపురం రూరల్‌ మండలంలో గల బండార్లంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. అమలాపురం డీఎల్‌పీవో జ్యోతిర్మయి స్పందించి ఈదరపల్లి పంచాయతీలో సోమవారం అత్యసర పారిశుద్ధ్య చర్యలను చేపట్టారు. గ్రామంలో నెలకొన్న చెత్త కుప్పలు, నీటి నిల్వలను తొలగించి బ్లీచింగ్‌ చల్లారు.  తహసీల్దార్‌ బేబీ జ్ఞానాంబ, ఎంపీడీవో జి.శివరామకృష్ణయ్య, మండల ఆర్యోగ కేంద్రం వైద్యాధికారి ఎస్‌.స్వర్ణకమల గ్రామంలో ఉదయం నుంచి ఈదరపల్లిలోనే మకాం వేసి వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ప్రాథమికంగా నివారించే హోమియో పతి మాత్రలను పంపిణీ చేశారు.

గ్రామంలో ఎటు చూసినా మురుగుకూపాలే
ఈదరపల్లి గ్రామంలో ఎటు చూసినా మురికి కూపాలతో అపరిశుభ్రత తాండవిస్తోంది. ముఖ్యంగా గ్రామంలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీ, వర్మ కాలనీల్లో డ్రైనేజీలకు అవుట్‌ లెట్స్‌ లేక మురుగు నీరు ఇళ్ల మధ్య, ఖాళీ ప్రదేశాల్లో చెరువులను తలపించేలా నీటి గుంతలు ఏర్పడ్డాయి.

>
మరిన్ని వార్తలు