విశాఖలో మరో స్వైన్ ఫ్లూ మరణం

1 Apr, 2014 16:03 IST|Sakshi
విశాఖలో మరో స్వైన్ ఫ్లూ మరణం

దాదాపు రెండేళ్ల క్రితం మన దేశాన్ని.. ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచాన్నే వణికించిన స్వైన్ ఫ్లూ వ్యాధి ఇప్పుడు మరోసారి మన రాష్ట్రంలో కనిపించింది. విశాఖపట్నంలో 27 ఏళ్ల యువకుడి ప్రాణాలు బలిగొంది. హెచ్1ఎన్1 వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన ఆ యువకుడు గాజువాక ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మంగళవారం ఉదయం మరణించినట్లు ఆరోగ్యశాఖాధికారులు నిర్ధారించారు. విశాఖపట్నంలోని శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన అతడు ఈ వ్యాధితోనే ప్రాణాలు కోల్పోయాడు.

విశాఖపట్నంలోనే ఈ సంవత్సరం నమోదైన స్వైన్ ఫ్లూ మరణాల్లో ఇది రెండోదని వైద్యాధికారిణి దేవి చెప్పారు. నెల రోజుల క్రితం దక్షిణభారత దేశ యాత్రకు వెళ్లి వచ్చినప్పటి నుంచి అతడు దగ్గు, జలుబు, నోట్లోంచి రక్తం కారడం లాంటి లక్షణాలు కనిపించాయి. దాంతో అతడు ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంవత్సరం జనవరిలోనే 27 ఏళ్ల గర్భిణి ఒకరు ఇదే వ్యాధితో విశాఖలో మరణించారు. ఇంకా ఎవరికైనా ఈ వ్యాధి లక్షణాలున్నాయేమో తెలుసుకోడానికి ఇంటింటి సర్వే చేయిస్తున్నట్లు డాక్టర్ దేవి చెప్పారు.

మరిన్ని వార్తలు