స్వైన్‌ఫ్లూ కలకలం

11 Jan, 2015 04:26 IST|Sakshi
స్వైన్‌ఫ్లూ కలకలం

 సాక్షి ప్రతినిధి, ఒంగోలు :జిల్లాలో స్వైన్‌ఫ్లూ కలకలం రేపింది. పంగలూరు మండలానికి చెందిన జాగర్లమూడివారిపాలెం వాసి శివకృష్ణ (27) స్వైన్‌ఫ్లూ భారిన పడి మృత్యువాత పడ్డారు. మరోవైపు ఇదే సమయంలో జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, చలిగాలులు వీస్తుండటంతో ఈ వ్యాధి ప్రబలిపోయే అవకాశం ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వైద్యాధికారులు మాత్రం పూనేలోని వైరాలజీ ల్యాబ్ పరీక్షల అనంతరం మాత్రమే స్వైన్‌ఫ్లూగా గుర్తిస్తామని చెబుతున్నారు. ఏల్చూరులో స్టోన్‌క్రషర్‌లో పనిచేస్తున్న శివకృష్ణ 11 రోజుల క్రితం స్వగ్రామం వెళ్లి వస్తానని ఏల్చూరు నుంచి జాగర్లమూడివారిపాలెం వచ్చాడు. అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి జలుబు, దగ్గు, జ్వరం ఇతర లక్షణాలతో బాధపడుతుండటంతో అద్దంకి, మేదరమెట్ల ఆసుపత్రుల్లో చూపించి తగ్గకపోవడంతో ఒంగోలులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు అనుమానంతో చెన్నైలోని కింగ్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించి స్వైన్‌ఫ్లూగా ప్రాథమికంగా నిర్థారించారు. అతనని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతునికి భార్య, ఆరునెలల కూతురు ఉన్నారు.
 
 శోకసంద్రంలో శివకృష్ణ కుటుంబం...
 పంగులూరు మండలం జాగర్లమూడివారిపాలెం గ్రామానికి చెందిన కోటేశ్వరావు, పద్మలకు ఇద్దరు కుమారులు, వీరిలో శివకృష్ణ (27)పెద్దవాడు, సంతమాగులూరు మండలంలోని ఏల్చూరులోని ఓ క్రషర్‌లో పనిచేస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం శ్రీకాకుళంకు చెందిన మాధవితో వివాహమైంది. లిఖిత అనే ఆరు నెలల పాప ఉంది. తమ్ముడు రామకృష్ణ ఎంసీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాదులో ఉన్నాడు. వీరిది సన్నకారు రైతు కుటుంబం. మూడెకరాలలోపు పొలంతో వ్యవసాయం చేసుకోవడంతోపాటు, కూలీ నాలి చేసుకుని బిడ్డలను ఆ తల్లిదండ్రులు చదివించారు. కుటుంబ పోషణ కోసం పెద్ద కుమారుడు శివకృష్ణ క్రషర్‌లో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడ్ని ఎంసీఏ వరకు చదివించారు. అతను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. వ్యవసాయంతో వచ్చే ఆదాయంతోపాటు పెద్ద కుమారుడు క్రషర్‌లో పనిచేసిన డబ్బుతో ఆ కుటుంబం గడుస్తోంది.
 
 ఈ క్రమంలో అకస్మాత్తుగా పెద్ద కుమారుడు మరణించడంతో సంపాదించి కూడు పెట్టే దిక్కును ఆ కుటుంబం కోల్పోయింది. కుమారుని మరణంతో ఆ కుటుంబం శోక సముద్రంతో మునిగిపోయింది. అతనికి స్వైన్‌ఫ్లూ ఎలా సోకిందన్నది ఇంకా అంతుబట్టడం లేదు. గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్న శివకృష్ణ ఇటీవల శ్రీకాకుళం వెళ్లి వచ్చాడని,  అదే సమయంలో జాగర్లమూడికి వచ్చిన హైదరాబాద్ వ్యక్తి కూడా ఇటువంటి లక్షణాలతో బాధపడ్డాడని అతని వద్ద నుంచి సోకి ఉండవచ్చని వైద్యాధికారులు భావిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు జాగర్లమూడివారిపాలెంతో పాటు, అతను పనిచేస్తున్న ఏల్చూరులో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి అందరిని పరిశీలించాలని నిర్ణయించారు. 2012లో ఏల్చూరుకు చెందిన వ్యక్తి స్వైన్‌ఫ్లూతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆ రెండు గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 

మరిన్ని వార్తలు