టీ నోట్‌పై ఒక్క అడుగు ముందుకు వేసినా మెరుపు సమ్మె

17 Oct, 2013 02:18 IST|Sakshi

 కడప అర్బన్, న్యూస్‌లైన్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నోట్‌పై ఒక్క అడుగు ముందుకు వెళ్లే నిర్ణయం తీసుకున్నా ఇకపై మెరుపు సమ్మె చేస్తామని ఏపీఎస్‌ఆర్‌టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజినల్ కార్యదర్శి పీవీ శివారెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన యూనియన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.    
 
 ఈనెల 11వ తేదిన యూనియన్ సంఘాలతో రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చల సారాంశంపై కడప రీజియన్‌లోని అన్ని డిపోల ఎన్‌ఎంయూ అధ్యక్ష, కార్యదర్శులతో యూనియన్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశానికి ఎన్‌ఎంయూ సీమాంధ్ర కన్వీనర్ పీవీ రమణారెడ్డి విచ్చేయనున్నట్లు ఆయ న తెలిపారు.   డిస్ ఎంగేజ్ అయిన కండక్టర్లు, డ్రైవర్లను తిరిగి తీసుకుంటామని రీజినల్ అధికారులు పిలిపిస్తున్నారన్నారు.

జిల్లాలో ఈ సంవత్సరం 42 మంది మహిళా కండక్టర్లు శ్లాట్ పేరు మీద తొలగిం చారన్నారు. 114 మంది డ్రైవర్లను తీసి వేశారన్నారు. వీరిలో 91 మందిని తెలంగాణ ప్రాంతంలోని నల్లగొండలో అవసరమని పంపిం చాలనే నిర్ణయం ప్రస్తుత  పరిస్థితుల్లో సరికాదన్నారు. జిల్లాలో 30 సర్వీసులను వెంటనే పునరుద్ధరిస్తే 78 మంది కండక్టర్లు, 78 మంది డ్రైవర్లు అవసరమవుతారన్నారు. ఆ మేరకు అధికారులు ఆలోచించాలన్నారు. కడప రీజినల్ జాయింట్ సెక్రటరీ పురుషోత్తం, డిపో సెక్రటరీ డీడీఎస్ మణిలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు