తాడో పేడో!

7 Apr, 2017 08:45 IST|Sakshi
తాడో పేడో!
► రసకందాయంలో నంద్యాల రాజకీయం
► అధికార పార్టీలో ఆరని చిచ్చు
► కార్యకర్తల భేటీలతో నేతలు బిజీ
► నేడు శిల్పా వర్గం సమావేశం
► ఆదివారం మాజీ మంత్రి ఫరూక్‌..
► రెండు రోజుల్లో కార్యకర్తలతో  భూమా బ్రహ్మానందరెడ్డి చర్చలు
► ఇదే బాటలో ఎస్పీవై రెడ్డి వర్గం
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
నంద్యాల ఉప ఎన్నికల వేడి అధికార పార్టీలో రోజురోజుకు రాజుకుంటోంది. ఉప ఎన్నికల సీటు తమకంటే తమకు ఇవ్వాలని ఎవరికి వారే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఎవరికి వారుగా అధిష్టానానికి సిగ్నల్స్‌ పంపగా.. తాజాగా కార్యకర్తల సమావేశాలు షురూ చేశారు. తనకు సీటు ఇవ్వాలని ఇప్పటికే అధిష్టానాన్ని సంప్రదించిన మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి శుక్రవారం కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.
 
 ఇదే బాటలో మరో మాజీ మంత్రి ఎన్‌.ఎం.డి.ఫరూక్‌ కూడా ఆదివారం కార్యకర్తలతో భేటీ కానున్నట్లు తెలిసింది. ఇక భూమా కుటుంబానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డి కూడా రెండు రోజుల్లో కార్యకర్తలతో చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మిగిలిన ఎస్‌.పి.వై. రెడ్డి వర్గం కూడా కార్యకర్తల భేటీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారుగా తమ సత్తా చాటాలని నడుపుతున్న రాజకీయ చదరంగంలో ఎవరి ఎత్తు పారుతుందో చూడాల్సి ఉంది.
 
పోటీ చేయాల్సిందే.. 
ప్రధానంగా నంద్యాల అసెంబ్లీ సీటును ఆశిస్తున్న మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి ఇందుకోసం తన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇప్పటికే నేరుగా ముఖ్యమంత్రిని కలసి తనకు సీటు ఇవ్వాలని ఆయన కోరారు. అయితే అధిష్టానం నుంచి సానుకూల స్పందన లేని నేపథ్యంలో స్వతంత్రంగా బరిలోకి దిగాలని ఆయన యోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూమా కుటుంబానికి సీటు ఇస్తే సహకరించేది లేదని పరోక్షంగా ఇప్పటికే తేల్చిచెప్పారు. తాజాగా కార్యకర్తల భేటీలోనూ ఇదే అంశం ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.
 
 పోటీ చేయాల్సిందేననే డిమాండ్‌ కార్యకర్తల నుంచి వచ్చేలా చూసేందుకే నేడు సమావేశమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లుగా ఉన్న రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ఉప ఎన్నికల్లో భూమా కుటుంబానికి సహకరిస్తే తాము మీ వెంట నడవబోమని కూడా ఈ సమావేశంలో కార్యకర్తలు తేల్చి చెప్పనున్నట్లు సమాచారం. నియోజకవర్గాన్ని వదిలిపెడితే నియోజకవర్గంలో రాజకీయ సమాధేనని ఈ సందర్భంగా తమ నేతకు ఆయన అనుచరులు స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వేరే పార్టీ నుంచి పోటీ చేయాలా, స్వతంత్రంగా బరిలోకి దిగాలా? అనే అంశాన్ని నేటి కార్యకర్తల సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
 
అదే బాటలో...
ఉప ఎన్నికల్లో  సీటు కోసం శిల్పామోహన్‌రెడ్డి కదుపుతున్న పావులకు దీటుగా ఫరూక్‌ వర్గం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రెండు దఫాలుగా కనీసం తమ నేత పేరును పరిశీలించకపోవడాన్ని ఆయన అనుచరులు తప్పుపడుతున్నారు. ప్రధానంగా ముస్లిం ఓటర్లున్న నంద్యాల అసెంబ్లీ సీటును తమ నేతకు ఇవ్వాల్సిందేనని ఆయన అనుచరులు కోరుతున్నారు. లేనిపక్షంలో అధికార పార్టీకి దూరమవ్వాలని కూడా ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు.
 
 ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన కార్యకర్తల భేటీ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా భూమా కుటుంబం నుంచి సీటు ఆశిస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి ఇప్పటికే నంద్యాలలో పర్యటిస్తున్నారు. అధిష్టానం నుంచి తనకే సీటు కన్‌ఫర్మ్‌ అయిందని ప్రచారం చేసుకుంటున్నారు. భూమా అనుచరులు మొత్తం తన వెంటే ఉన్నారనే సంకేతాన్ని అధిష్టానానికి పంపేందుకు వీలుగా త్వరలో ఆయన కూడా కార్యకర్తలతో భేటీ కానున్నారని సమాచారం. ఇక అదే బాటలో భూమా కుటుంబానికి టిక్కెట్‌ ఇవ్వకపోతే తామూ రంగంలో ఉన్నామంటూ ఎస్‌.పి.వై.రెడ్డి వర్గం కూడా సమావేశానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నికల రాజకీయ వేడి అధికార పార్టీలో రోజురోజుకు సెగ పుట్టిస్తోంది.  
మరిన్ని వార్తలు