నేరాలకు కేరాఫ్ తాడేపల్లి.

30 May, 2016 00:36 IST|Sakshi
నేరాలకు కేరాఫ్ తాడేపల్లి.

వరుస కిడ్నాప్‌లతో కలకలం  
శ్రీమంతులే టార్గెట్
చేసేది..చేయించేది.. సెటిల్ చేసేది..
►  అంతా వారే!
 

 
తాడేపల్లి రూరల్ : శ్రీమంతులు... విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న పిల్లల తల్లిదండ్రులే టార్గెట్‌గా తాడేపల్లి ప్రాంతంలో కిడ్నాప్‌లు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో నేరస్తులు రూటు మార్చి సినీ ఫక్కీలో పక్కాగా ప్లాన్ చేసి, గుట్టు చప్పుడు కాకుండా ‘టార్గెట్’లను కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి వారి నుంచి లక్షలాది రూపాయలు గుంజుకుంటున్నారు. గత వారంలో వరుసగా తాడేపల్లిలో రెండు కిడ్నాప్‌లు, ఒక దోపిడీ జరిగాయి. ఇందులో దోపిడీ ఘటన మాత్రమే వెలుగు చూసింది. కిడ్నాప్ విషయాలు మాత్రం బయటకు రాలేదు. కిడ్నాప్ విషయాలు ఆ నోటా ఈ నోటా పోలీసుల చెవినబడ్డాయి. ఈ మేరకు తాడేపల్లి పోలీసులు ఆదివారం సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తాడేపల్లి మునిసిపల్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ బిల్డర్ ఇంటికి వెళుతుండగా అతడిని కారులో ఎక్కించుకుని, కిడ్నాప్ చేసి ఏటీఎం కార్డు, కొంత నగదు దోచుకెళ్లారు.

మరుసటి రోజు కుంచనపల్లికి చెందిన ఓ శ్రీమంతుడిని కిడ్నాప్ చేశారు. అనంతరం అతడిని తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలలో కారులో తిప్పుతూ చిత్రహింసకు గురి చేశారు. అదే సమయంలో కిడ్నాప్ అయిన వ్యక్తికి కిడ్నాప్ చేయించిన వ్యక్తి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని సమాచారం అడుగుతాడు. కిడ్నాప్ అయిన వ్యక్తి నుంచి విషయాలు తెలుసుకున్నట్టు నటించి, కిడ్నాపర్స్‌తో ఫోన్‌లో మాట్లాడి, వారు అడిగిన డబ్బులు ఇస్తానంటూ అతనే ఆ డబ్బు తెస్తాడు. ఆ డబ్బును కిడ్నాపర్లకు అందజేసి, అనంతరం కిడ్నాప్ అయిన వ్యక్తి నుంచి వసూలు చేసుకుంటాడు.


 నగదు వసూలు ఇలా..
ఇలా జరిగిన కిడ్నాప్‌లో కుంచనపల్లికి చెందిన ఓ శ్రీమంతుడి వద్ద ఎనిమిది లక్షలు వసూలు చేశారు. సదరు కిడ్నాప్ అయిన వ్యక్తి దగ్గర ఈ నెల 21న రూ. లక్ష, 23న రూ. 3 లక్షలు, 25న రూ. 4.5 లక్షలు వసూలు చేశారు. దీనిలో కూడా కిడ్నాపర్స్‌తో మాట్లాడినందుకు రూ. 50 వేలు అంటూ అదనంగా నగదు వసూలు చేశాడు. ఈ కిడ్నాప్‌లు చేస్తున్నది తాడేపల్లికి చెందిన మాజీ నేరస్తుడిగా పోలీసులు గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో ఆ పాత నేరస్తుడు తాడేపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేకాట, కోడిపందేలు నిర్వహించడంతో ఎవరి ఆర్థిక పరిస్థితి ఏంటనేది తెలిసిన వ్యక్తి.

వారిని కిడ్నాప్ చేస్తే ఎంత డబ్బు వసూలు చేయవచ్చు, ప్రాణభయం ఉన్నవారిని మాత్రమే ఎంచుకుని ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో మహానాడు ప్రాంతానికి చెందిన ముగ్గురు కిడ్నాపర్లు ఉన్నట్టు సమాచారం. అసలు సూత్రధారి పరారీ ఉండి, అధికార పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

మరిన్ని వార్తలు