తాడేపల్లిగూడెం గట్టు..విలక్షణంగా జై కొట్టు..

23 Mar, 2019 13:15 IST|Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం: జిల్లాలో అపారచరిత్ర కలిగిన పట్టణాలనూ తోసిరాజని వేగంగా అభివృద్ధి చెందిన తాడేపల్లిగూడెం 1952లో నియోజకవర్గంగా ఆవిర్భవించింది. విలక్షణ రాజకీయానికి చిరునామాగా మారింది. ఓటర్లలో చైతన్యం ఎక్కువ. ఎందరో ఉద్దండులు ఇక్కడి నుంచి ఎన్నికై రాష్ట్ర రాజకీయాలను శాసించారు.  


16సార్లు ఎన్నికలు 
ఇది 1955లో ద్విశాసనసభా నియోజకవర్గం. ఇప్పటి వరకు రెండు ఉప ఎన్నికలతో కలుపుకొని 16 సార్లు ఎన్నికలు జరిగాయి. గతంలో తాడేపల్లిగూడెం పట్టణం, తాడేపల్లిగూడెం, పెంటపాడు, నిడమర్రు, గణపవరం మండలాల్లోని కొన్నేసి గ్రామాలతో కలిపి ఈ నియోజకవర్గం ఉండేది. 2009 పునర్విభజన తర్వాత  పెంటపాడు మండలం, తాడేపల్లిగూడెం మండలం, పట్టణం కలిపి నియోజకవర్గంగా మారాయి.  


వలసదారుల ప్రాంతం 
తాడేపల్లిగూడెం పట్టణానికి అంత చారిత్రక నేపథ్యం లేదు. వలసదారుల స్థిర ప్రాంతంగా ఇది  ప్రఖ్యాతిగాంచింది. పశ్చిమ డెల్టా కాలువ గట్టున తాడేపల్లి కుటుంబాల పేరిట పంచాయతీగా పురుడు పోసుకొని, సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలి టీగా ఎదిగింది. జల, రైలు, రోడ్డు రవాణా కనెక్టివిటీ ప్రాంతంగా పురోభివృద్ధి చెందింది.  

 
వాణిజ్య చిరునామా
జిల్లాకు భౌగోళికంగా కేంద్రస్థానంలో ఉన్న నియోజకవర్గం ఇది. వాణిజ్యానికి చిరునామాగా ఖ్యాతిగాంచింది. దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు చైనా, బంగ్లాదేశ్‌ వంటి దేశాలతో , యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశాలతో వ్యాపారం చేసిన అనుభవం ఈ ప్రాంతానికి ఉంది. 


పదేళ్లుగా అభివృద్ధికి దూరం 
గత పదేళ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధికి దూరమైంది. గత ఐదేళ్లలో టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ప్రాతినిథ్యం వహించిన ఈ నియోజకవర్గంలో వారి మధ్య కుమ్ములాటలు ఈ ప్రాంతానికి శాపంగా మారాయి. మట్టి, ఇసుక, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, నాన్‌ లే అవుట్లలో అక్రమాలతో అధికారపార్టీ నేతలు పేట్రేగిపోయారు. తీవ్ర అవినీతికి పాల్పడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా నియోజకవర్గం వెనుకబడిపోయింది. సామాన్యులకు మౌలిక వసతులు దూరమయ్యాయి. దీంతో అధికారపార్టీ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 


ప్రధాన సమస్యలు 
 వేసవిలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది. శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాల్సిన దుస్థితి. రెండో వేసవి జలాశయం నిర్మాణం, తాడేపల్లిగూడెం మండలంలో తాడిపూడి కాలువల సమస్య, ఎర్రకాలువ సమస్య పరిష్కారం కాలేదు. ప్రభుత్వ విద్యాలయాల సమస్యలూ ఉన్నాయి. పెంటపాడు మండలంలో బోడపాడు వంతెన సమస్య పరిష్కారం కావడం లేదు.  


వైఎస్సార్‌సీపీ ప్రభంజనం 
నియోజకవర్గంలో ఇప్పుడు వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం వీస్తోంది. వైఎస్సార్‌ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచిన కొట్టు సత్యనారాయణ ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన చేసిన అభివృద్ధే ఆయనను గెలిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతూ కొట్టు సత్యనారాయణ జనం మధ్యలోనే ఉన్నారు. వైఎస్సార్‌సీపీని బలోపేతం చేశారు. పార్టీ కార్యక్రమాలతో ప్రజాదరణ పొందారు. ఇప్పుడు ఆయనపై ప్రజలు సానుకూలంగా ఉన్నారు.

 
రెండుసార్లే ఎక్కువ
ఈ నియోజకవర్గం నుంచి రెండుసార్లు కంటే ఎక్కువగా గెలిచిన వారు లేరు.   కాంగ్రెస్‌ తరఫున  చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు, అల్లూరి కృష్ణారావు రెండేసిసార్లు గెలిచారు.  ఈలి ఆంజనేయులు స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి, టీడీపీ తరఫున ఓసారి గెలుపొందారు. యర్రా నారాయణస్వామి టీడీపీ తరఫున రెండుసార్లు గెలిచారు. ఈలి వరలక్ష్మీ టీడీపీ తరఫున ఓసారి, కాంగ్రెస్‌ తరఫున ఓసారి గెలిచారు.  పసల కనకసుందరరావు టీడీపీ తరఫున రెండు సార్లు గెలిచారు.   


వైఎస్సార్‌దయతో మారిన రూపురేఖలు
వైఎస్సార్‌ ప్రభంజనంతో 2004లో కొట్టు సత్యనారాయణ గెలిచి రికార్డు స్థాయిలో అభిృద్ధి చేశారు. అప్పటివరకూ అభివృద్ధిలో వెనుకబడిన ఈ ప్రాంతం రూపురేఖలు ఒక్కసారిగా మారాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలవతో  కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉండగా అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కింది. రూ.650 కోట్ల అభివృద్ధి జరిగింది. దేశంలో రెండోదైన డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన యూనివర్సిటీ ఇక్కడ ఏర్పడింది. ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్, వెటర్నరీ పాలిటెక్నిక్‌ వంటివి ఏర్పాటయ్యాయి.  


ఇప్పటివరకూ ఎమ్మెల్యేలు ఇలా.. 
సంవత్సరం                            విజేత                               పార్టీ 
1952                          సీహెచ్‌.వరప్రసాదమూర్తిరాజు           కాంగ్రెస్‌
1955 ద్విశాసనసభ        కె.వెంకటకృష్ణావతారం                    కాంగ్రెస్‌
1955                         నంబూరి శ్రీనివాసరావు                   కాంగ్రెస్‌
1962                         అల్లూరి కృష్ణారావు                         కాంగ్రెస్‌
1967                         అల్లూరి కృష్ణారావు                         కాంగ్రెస్‌ 
1972                         ఈలి  ఆంజనేయులు                      స్వతంత్ర 
1978                         సీహెచ్‌ వరప్రసాదమూర్తిరాజు            కాంగ్రెస్‌ 
1983                         ఈలి  ఆంజనేయులు                      తెలుగుదేశం
1983 (ఉప ఎన్నిక)      ఈలి వరలక్ష్మి                                తెలుగుదేశం 
1985                        యర్రా నారాయణస్వామి                  తెలుగుదేశం 
1987 (ఉప ఎన్నిక)      ఈలి వరలక్ష్మి                                కాంగ్రెస్‌  
1989                        పసల కనకసుందరరావు                  తెలుగుదేశం 
1994                        పసల కనకసుందరరావు                 తెలుగుదేశం 
1999                        యర్రా నారాయణస్వామి                 తెలుగుదేశం 
2004                        కొట్టు సత్యనారాయణ                     కాంగ్రెస్‌ 
2009                        ఈలి నాని                                    ప్రజారాజ్యం 
2014                        పైడికొండల మాణిక్యాలరావు             బీజేపీ 


మండలాలు      తాడేపల్లిగూడెం, పెంటపాడు
జనాభా :            2,69,040
పురుషులు         1,35,471
స్త్రీలు                  1,33,560
ఇతరులు            09
ఓటర్లు :             1,96,980
పురుషులు         97,078
స్త్రీలు                  99,883
ఇతరులు            19
 

మరిన్ని వార్తలు