కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలి :శ్రీదేవి

15 Jun, 2020 11:40 IST|Sakshi

 ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి

తాడికొండ: కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేయాలని తాడికొండ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఆదివారం రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ కోవిడ్‌ నుంచి కోలుకున్న రోగుల నుంచి ప్లాస్మా యాంటీ బాడీలను తీసుకొని వాటిని కోవిడ్‌ రోగికి ఎక్కించడం ద్వారా ఎక్కువ శాతం ఫలితం వస్తుందన్నారు. కోలుకున్న రోగుల నుంచి రక్తాన్ని సేకరించి మిగతా రోగులకు ఎక్కించడం కొత్తేమీ కాదని వందేళ్ల కిందట స్పానిష్‌ ఫ్లూ విజృంభించినపుడు కూడా దీనిని వాడారన్నారు. ఇటీవల కాలంలో వచ్చిన ఎబోలా, సార్స్, మెర్స్‌ సహా 2009లో వచ్చిన హెచ్‌1 ఎన్‌1(స్వైన్‌ ఫ్లూ)కు కూడా ప్లాస్మాతో చికిత్స చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారు తమ వంతు సాయంగా ప్రస్తుతం వైరస్‌ బారిన పడి పోరాడుతున్న వారికి రక్తంలోని ప్లాస్మాను దానం చేయాలని కోరారు. 

రక్తదానం ప్రాణదానంతో సమానం
ప్రాణాపాయంలో ఉన్నవారికి అత్యవసరంగా రక్తం అవసరమైతే అనేక మంది యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి చెప్పారు. రక్తదానం పట్ల పట్టణ ప్రాంతాల్లో కొంతమేర అవగాహన ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రజల్లో నేటికీ అపోహలు ఉన్నాయన్నారు. రక్తం ఇస్తే బలహీనమై పోతామనే భయం నిజం కాదని తెలియపరచాల్సిన అవసరం ఉందన్నారు. రక్తదానం చేసినా చేయకపోయినా మన శరీరంలో రక్తనాళాలు కొద్ది రోజులకు నశించడం, కొత్తవి ఉత్పత్తి కావడం జరుగుతూనే ఉంటుందన్నారు. రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లేనని, ఆరోగ్యకరమైన వ్యక్తి 18–60 సంవత్సరాల మధ్య కాలంలో ప్రతి మూడు నెలలకోసారి రక్తాన్ని దానం చేస్తే తన జీవిత కాలంలో 168 సార్లు ఇవ్వవచ్చని ఎమ్మెల్యే చెప్పారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు