కార్యకర్తలు ఇప్పుడు గుర్తొచ్చారా బాబూ? 

9 Jul, 2019 06:41 IST|Sakshi

చంద్రబాబు పర్యటన ఓ నాటకం 

టీడీపీ హయాంలో అధికారులకు రక్షణ లేకుండా పోయింది 

మీడియాతో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 

సాక్షి, తాడిపత్రి: అధికారంలో ఉన్నన్ని రోజులు గుర్తుకు రాని కార్యకర్తలు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు గుర్తొచ్చారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. 2009 ఎన్నికల సందర్భంగా ఇబ్బందులు పడిన కార్యకర్తలను చంద్రబాబు ఎందుకు ఆదుకోలేదన్నారు. తాడిపత్రి మండలంలోని వీరాపురం గ్రామంలో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త చింతా భాస్కర్‌రెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు మంగళవారం చంద్రబాబు రానున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పోలింగ్‌ రోజున దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల ఘర్షనలో చింతా భాస్కర్‌రెడ్డి మృతి చెందడం జరిగిందన్నారు. అప్పుడు కూడా చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడని గుర్తు చేశారు. అప్పుడు పరామర్శకు రాని ఆయన... ఇప్పుడు రావడం రాజకీయ నాటకంలో భాగమన్నారు. టీడీపీ హయాంలోనే శాంతిభద్రతలు క్షీణించాయని ఎమ్మెల్యే ఆరోపించారు. తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి చేసిన ఘటన ఇంకా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు.
 
జేసీ సోదరులు దాడి చేసినప్పుడు ఏమయ్యావ్‌..? 
2009 ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లో ఉన్న జేసీ సోదరులు టీడీపీ నాయకుల ఇళ్లపై దాడి చేశారని.. టీడీపీ నాయకుడు, తెలుగు యువత జిల్లా మాజీ అధ్యక్షుడు మురళీప్రసాద్‌ ఇంటికి నిప్పు పెట్టారని పెద్దారెడ్డి గుర్తుచేశారు. అయితే అప్పట్లో మురళీప్రసాద్‌కు నష్టపరిహారం కింద రూ.20 లక్షలు ప్రకటించిన చంద్రబాబు.. నేటికీ ఆ మొత్తాన్ని ఇవ్వలేదన్నారు.  

ఆ ఐదేళ్లూ దురాగతాలే 
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, జేసీ సోదరుల దురాగతాల వల్ల పెద్దవడుగూరు మండలం అప్పేచెర్ల భాస్కర్‌రెడ్డి బలయ్యారని పెద్దారెడ్డి గుర్తు చేశారు. మరి వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం తాడిపత్రిలో పోలీసుల తీరు చాలా బాగుందని పొగడ్తలు కురిపించిన వారే.. ఇప్పుడు పోలీసుల చర్యలను తప్పుపడుతున్నారని పెద్దారెడ్డి మండిపడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారని, దీనికి తామేమీ అడ్డుచెప్పలేదన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే జేసీ తన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారనే అక్కసుతో పోలీసుల తీరుపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని గుర్తించాలన్నారు. 

జేసీ పవన్‌ క్రికెట్‌ బుకీ 
పలుకేసుల్లో ముద్దాయిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ దర్జాగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రావడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. జేసీ పవన్‌ కుమార్‌రెడ్డి ఓ క్రికెట్‌ బుకీ అని, అసాంఘిక కార్యకలాపాలకు కొమ్ముకాస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. తాము రైతు కుటుంబం నుంచి వచ్చామని, తనకు విద్య లేకపోయినా సంస్కారం ఉందన్నారు. అందువల్లే నియోజకవర్గ ప్రజలు తనకు పట్టం కట్టారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి స్పష్టంచేశారు.  

మరిన్ని వార్తలు