జేసీ ప్రభాకర్‌రెడ్డికి సీఐ భారీ విందు

8 Oct, 2018 12:11 IST|Sakshi
తన స్వగ్రామంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఊరేగింపుగా తీసుకెళుతున్న సీఐ నారాయణరెడ్డి

వివాదాస్పదమైన తాడిపత్రి సీఐ తీరు 

తాడిపత్రిలో పోస్టింగ్‌తో స్వామిభక్తి

ప్రతిపక్ష నేత పెద్దారెడ్డి కార్యక్రమాలకు తరచూ ఆటంకాలు

అనంతపురం, తాడిపత్రి: తాడిపత్రి పోలీసుల తీరు రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. అధికారపార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష నేతలను టార్గెట్‌ చేస్తున్నారు. ఇలా ఏకపక్షంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసు అధికారులపై ఇటీవల ఉన్నతాధికారులు వేటు వేసిన విషయం విదితమే. తాజాగా తాడిపత్రి వైఎస్సార్‌సీపీ సమన్వకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ముచ్చుకోట నుంచి పెద్దపప్పూరు వరకు చేపట్టిన పాదయాత్రకు మొదట పోలీసులు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి నిరాకరించడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ సొంత మండలంలో పెద్దారెడ్డి పాదయాత్ర చేస్తే తమ ఇమేజీ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తమ అనుంగులైన పోలీసు అధికారులను ఉసిగొల్పారు. పాదయాత్రకు సిద్ధమైన పెద్దారెడ్డిని అరెస్ట్‌ చేయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అధికారపార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విపక్ష నాయకులు బహిరంగంగా విమర్శలు చేశారు.

శాంతిభద్రతల సమస్యలకు కారణం పోలీసులే
తాడిపత్రి ప్రాంతంలో శాంతిభద్రతలు తలెత్తడానికి కారణం పోలీసులే అన్న ఆరోపణలు విపక్ష పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. తాడిపత్రిలో పోస్టింగ్‌లకు జేసీ సోదరుల సిఫార్సుల కోసం పాకులాడి పోస్టింగ్‌లు తెచ్చుకున్నపోలీసులు స్వామి భక్తి చాటుకునేందుకు వారు చెప్పిందే తడవుడా ‘జీ హుజూర్‌’ అంటూ తలూపి న్యాయాన్యాయాలతో పని లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో చట్టం అనేది అధికారపార్టీ నేతలకు చుట్టంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు ఏకపక్షంగా వ్యహరించడంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. 


తన నివాసంలో ఎమ్మెల్యే జేసీకి విందు ఇస్తున్న సీఐ నారాయణరెడ్డి 

వివాదాస్పదమైనసీఐ నారాయణరెడ్డి పనితీరు  
తాడిపత్రిలో రూరల్‌ సీఐ నారాయణరెడ్డి పనితీరు తరచూ వివాదాస్పదమవుతోంది. ఎస్‌ఐలకు సీఐలుగా పదోన్నతులు ఇచ్చిన తరువాత మొట్టమొదటగా నారాయణరెడ్డి పేరే పరిశీలించారు. వాస్తవానికి ఎస్‌ఐగా పనిచేసిన చోటే సీఐగా తొలిపోస్టింగ్‌ ఇవ్వరు. అలాగే సీఐగా పదోన్నతి లభిస్తే రెండేళ్ల పాటు లూప్‌లైన్‌లో ఉంచాల్సి ఉంది. ఈ మేరకు కొన్ని రోజులు నారాయణరెడ్డిని పీటీసీకి పంపిన ఉన్నతాధికారులు..ఆ వెంటనే ఆయన ఎస్‌ఐగా ఎక్కడ పనిచేశారో అదే స్టేషన్‌కు సీఐగా పోస్టింగ్‌ ఇవ్వడం చాలా విమర్శలకు తావిస్తోంది. దీనికి కారణం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సిఫార్సే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇందుకు కృతజ్ఞతగా నారాయణరెడ్డి తన సొంత గ్రామం వైఎస్సార్‌ జిల్లా కొండాపురం మండలం లావనూరులో సీఐ నారాయణరెడ్డి భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఆహ్వానించారు. అనుచరగణంతో లావనూరుకు వెళ్లిన జేసీ ప్రభాకర్‌రెడ్డికి సీఐ నారాయణరెడ్డి అనూహ్యరీతిలో స్వాగతం పలికారు. తన గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో సీఐ నారాయణరెడ్డి ఎమ్మెల్యే జేసీపీఆర్‌ ఏది చెబితే దానికి తలూపి పాటించడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతోందన్నది సుస్పష్టం. మరి స్వామి భక్తి చాటుకుంటున్న సీఐ నారాయణరెడ్డి వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు