హుదూద్‌పై హై అలర్ట్

11 Oct, 2014 03:54 IST|Sakshi
హుదూద్‌పై హై అలర్ట్

ఒంగోలు టౌన్: హుదూద్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించగా, తాజాగా పలు సూచనలు చేసింది. తీర ప్రాంత మండలాల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు తుఫాన్‌పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత మండలాలకు నియమించిన ప్రత్యేక అధికారులు ఆయా మండల కేంద్రాల్లోనే ఉండాలన్నారు. మండల స్థాయిలో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

తుఫాన్ సమయంలో సముద్రం పొంగి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నందున మత్స్యకారుల వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. మత్స్యకార గ్రామాల్లోని పెద్దలను కలిసి తగిన సూచనలు అందించాలన్నారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, రోడ్లు భవనాలశాఖ, అగ్నిమాపకశాఖ, గ్రామీణ నీటిసరఫరాశాఖ, పౌరసరఫరాలశాఖ, మత్స్యశాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను గుర్తించి వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించి శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. వారికి భోజన సదుపాయాలు కల్పించాలన్నారు. పెట్రోలు బంకుల్లో తగినంత పెట్రోల్, డీజిల్‌ను అత్యవసర సేవల నిమిత్తం నిల్వ ఉంచాలని ఆ బంకుల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ సమయంలో ఏమైనా విపత్కర పరిస్థితులు సంభవిస్తే ప్రజలు వెంటనే తమ పరిధిలోని కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించాలని కలెక్టర్ విజయకుమార్ కోరారు.

డీఎస్పీ ఆఫీసులో కంట్రోల్ రూం
ఒంగోలు క్రైం: హుదూద్ తుఫాన్ సందర్భంగా ఒంగోలు డీఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ పి.జాషువా తెలిపారు. తుఫాన్ సందర్భంగా ఎలాంటి సమస్యలు రేకెత్తినా వెంటనే కంట్రోల్ రూంకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఒంగోలు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని వన్‌టౌన్, టూటౌన్, తాలూకా, చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులుప్పలపాడు, సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, కొండపి, కొత్తపట్నం పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎలాంటి సమస్య తలెత్తినా కంట్రోల్‌రూంకు ఫోన్ చేసి సమాచారమందించాలన్నారు. ఈ కంట్రోల్ రూంలో ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తుంటారని పేర్కొన్నారు. కంట్రోల్ రూం నంబర్లు 08592 232638, 73963 19191, 96186 15893 ను సంప్రదించాలని డీఎస్పీ జాషువా తెలిపారు.

తీర ప్రాంత వైద్యాధికారులు విధుల్లో ఉండాలి: డీఎంహెచ్‌వో
ఒంగోలు సెంట్రల్: తీర ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహించే వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా విధుల్లో ఉండి అత్యవసర వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే చంద్రయ్య శుక్రవారం ఆదేశించారు. ప్రతి ఆరోగ్యకేంద్రంలో వైద్య బృందాలు తక్షణ వైద్య సేవలు అందించడానికి అవసరమైన వాటిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
 
హుదూద్‌ని ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి
కందుకూరు: హుదూద్ తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ ఎ.మల్లికార్జున సూచించారు. తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తుఫాన్ హెచ్చరికల కేంద్రం నుంచి తాజాగా అందించిన సమాచారం మేరకు తుఫాన్ ప్రభావం జిల్లాపై కూడా బలంగా ఉంటుందన్నారు. ఈమేరకు డివిజన్ పరిధిలోని తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినట్లు వివరించారు. డివిజన్ పరిధిలో ఉలవపాడు, సింగరాయకొండ, గుడ్లూరు, జరుగుమల్లి మండాలల్లోని కొన్ని గ్రామాలపై ప్రభావం ఉంటుందన్నారు.

ఇప్పటికే ఆయా గ్రామాల్లో తుఫాన్ వస్తే ఎదుర్కొనేందుకు అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించామన్నారు. అలాగే సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఏ ప్రమాదం వచ్చినా వెంటనే కంట్రోల్ రూంకి సమాచారం ఇవ్వాలన్నారు. కంట్రోల్ రూంలో డీఏఓ 8886616055, 08598-223235 నంబర్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అలాగే తీర ప్రాంత గ్రామాల్లోని 30 నుంచి 40 మంది ఫోన్ నంబర్లు సేకరించి వారికి తుఫాన్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుగులో మేసేజ్‌లు పంపుతారన్నారు.

>
మరిన్ని వార్తలు