వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి

13 Jan, 2014 03:02 IST|Sakshi

నయీంనగర్, న్యూస్‌లైన్ : యువత వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పిలుపునిచ్చారు. హన్మకొండ కిషన్‌పురలోని వాగ్దేవి కళాశాలలో ఆదివారం వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువజన సమ్మేళనాన్ని నిర్వహించారు. కలెక్టర్ కిషన్ అధ్యక్షత వహించి సమ్మేళనాన్ని జ్యోతి వెలిగిం చి ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా ఎంపీ రాజయ్య హాజరై మాట్లాడుతూ యువత స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని సూచించారు.

భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన వివేకానందుడి సేవలు మరువలేనివన్నారు. అన్నింటి కంటే జ్ఞానం గొప్పదని, యువత జ్ఞానాన్ని పెంపొం దించుకుని తల్లిదండ్రులను గౌరవించాలని కోరారు. ప్రపంచ జనాభాలో భారతదేశం రెం డో స్థానంలో ఉందని వివరించారు. ఉన్నత విద్య పూర్తి చేసుకున్న యువత సైతం మాన వ సంబంధాలను మంటగలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి యువత సన్మార్గంలో నడవాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యంతో యువత ముందుకు సాగాలని కోరారు.

నేటి యువత పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి సంస్కృతీసంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ జి.కిషన్ మాట్లాడుతూ ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న నేటి యువతలో తగిన నైపుణ్యత కొరవడిందని చెప్పారు. యువత చెడు అనుకరణలతో బంగారు భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టివేసుకుంటుందన్నారు. ప్రతి గ్రీవెన్స్‌లో 50 మంది డిగ్రీలు, పీజీలు చదువులు పూర్తి చేసుకున్న యువతీయువకులు కనీసం అటెండర్, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పించాలని దరఖాస్తులు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధిలోకి రావాలని ఆయన సూచించారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో 40 శాతం యువత ఉందని ఆయన తెలిపారు. యువత శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం సంయుక్త కార్యదర్శి పాలకుర్తి విజయ్‌కుమార్‌కు కలెక్టర్ అవయదాన పత్రాన్ని అందజేశారు. సమావేశంలో రామకృష్ణ మఠం నుంచి ఆత్మపరమానందస్వామి, సెట్వార్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి కె.పురుషోత్తం, నెహ్రూ యువకేంద్రం మనోరంజన్, యువజన అవార్డు గ్రహీత మండల పరశురాములు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు