పొడగరి.. పదో తరగతి పాసయ్యాడు!

13 Jul, 2018 13:48 IST|Sakshi

రాజాం/సంతకవిటి : ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడిని గుర్తుపట్టారా? సంతకవిటి మండలం తలతంపర గ్రామానికి చెందిన ఇజ్జాడ షణ్ముఖరావు. వయసు 19 ఏళ్లు. హార్మోణుల ప్రభావం కారణంగా  ఎనిమిది అడుగుల ఎత్తు పెరిగాడు. చిన్న వయసులో పాఠశాలకు వెళ్లి చదువుకునే విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో స్వస్తి చెప్పాడు. ఉపాధి అవకాశాలు లేక.. స్థానికంగా పనులు దొరక్క అగచాట్లు పడుతుండేవాడు.

అయితే ఈ యువకుడి అసాధారణంగా పొడవు పెరగడంపై ఏడాదిన్నర క్రితం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు షణ్ముఖరావు వివరాలు సేకరించారు. పదో తరగతి పూర్తి చేస్తే ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో  పట్టువదలని విక్రమార్కుడిలా ఓపెన్‌ విద్య ద్వారా పదో తరగతి చదివాడు.

రెండు నెలల క్రితం పాలకొండ కేంద్రంగా పరీక్షలు  రాశాడు. ఇటీవల వచ్చిన ఫలితాల్లో పాసయ్యాడు. సంబంధిత సర్టిఫికెట్‌ను షణ్ముఖరావుకు   సంతకవిటి హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు యు.రవిశంకర్‌ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా పొడగరి షణ్ముఖరావు మాట్లాడుతూ.. అధికారులు స్పందించి ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశాడు.             

మరిన్ని వార్తలు