టామాకేర్ .. క్యార్ క్యార్

29 Jul, 2014 01:57 IST|Sakshi
టామాకేర్ .. క్యార్ క్యార్

 ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : ఏడాదికాలంగా జీతాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏలూరు కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని ట్రామాకేర్ ఉద్యోగులు 15 రోజులుగా రోడ్డెక్కారు. అయినా పాలకులు పట్టించుకోకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ముందుగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు నోటీసు జారీ చేశారు. అయినా స్పందన లభించక పోవడంతో గత 15 రోజుల క్రితం విధులను బహిష్కరించి ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్దే టెంటు ఏర్పాటు చేసుకుని మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు.
 
 అత్యవసర సేవలకు విఘాతం
 రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిలో ఎక్కువ మందికి సకాలంలో వైద్యం అందకపోవడంతో మృత్యువాత పడతారు. సకాలంలో వైద్యం అందిస్తే ఎంతో మంది జీవించే అవకాశం ఉంది. ఈ పరిస్థితి స్వయంగా వైద్యుడైన మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గమనించి రోడ్డు ప్రమాదాలకు గురైన క్షతగాత్రులకు సకాలంలో వైద్య సేవలందించాలనే ధ్యేయంతో జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న ప్రభుత్వాసుపత్రులలో ట్రామాకేర్ ఏర్పాటుకు 2009లో ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాలమేరకు ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో 2010లో ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
 
  దీనిలో మొత్తం 33 మంది సిబ్బందిని నియమించారు. ఈ సిబ్బందికి ఇచ్చే వేతనాలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశ్యంతో దివంగత నే త అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల నుంచి వేతనాలను మంజూరు చేయించారు. వైఎస్ మరణించినా ఈ నిధులు ఉన్నంత వరకు సిబ్బందికి వేతనాలు సక్రమంగానే అందాయి. 2013 జూలై నెల నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అయిపోవడంతో సిబ్బంది వేతనాలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఈ నెల వరకు జీతాలు విడుదల కాకపోవడంతో ఈ చిరు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించి ఆడిట్ జరగని కారణంగానే వేతనాలు నిలిచిపోయాయని వైద్య, విధాన పరిషత్ అధికారులు  చెబుతున్నారు. కాని ఆడిట్‌ను జరిపించే పక్రియను మాత్రం చేపట్టడం లేదు.
 
 నెరవేరని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల హామీలు
 ట్రామాకేర్ సెంటర్ ఉద్యోగులు సమ్మె ప్రారంభించినప్పటి నుండి ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే ఆడిట్ జరిపించి వేతనాలు ఇప్పిస్తామని హామీలు గుప్పిస్తున్నారు తప్ప పట్టించుకున్న వారు లేరు. 10 రోజుల క్రితం ఆసుపత్రి సూపరింటెండెండ్ కార్యాలయాన్ని ఉద్యోగులు ముట్టడించడంతో ఈ సమస్య పరిష్కానికి ఉన్నతాధికారులతో మాట్లాడతానని సూపరింటెండెండ్ ఈశ్వర ప్రసాద్ హామీ ఇచ్చారు. గత సోమవారం సమ్మె శిబిరం నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కాటమనేని భాస్కర్‌కు వినతి పత్రం అందించారు.ఆయన సమస్య పరిష్కారంపై నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్‌వో కె.శంకరరావును ఆదేశించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, దెందులూరు ఎమ్మెల్యే, చివరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు తమ సమస్యను మొరపెట్టుకున్నారు. హామీలు ఇచ్చారు తప్ప తమకు న్యాయం చేయలేదని ట్రామాకేర్ ఉద్యోగులు ఎం.కిషోర్, రమేష్, రాజేష్, సునీత, కవిత, విజయకుమారి, అనురాధ, దయామణి, స్వప్న, సుధారాణి, శాంతకుమారి, ఉష విజ్ఞప్తి చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు