విప్‌ దౌర్జన్యం నశించాలి

13 Feb, 2019 09:01 IST|Sakshi
హెచ్‌సీకి ఫిర్యాదుపత్రం ఇస్తున్న శివ కుమార్‌

కూన’పై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త గంగిరెడ్ల శివకుమార్‌

తమ్మినేని ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

శ్రీకాకుళం, పొందూరు: ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ వైఎస్సార్‌ సీపీ కార్యకర్త గంగిరెడ్ల శివకుమార్‌పై ఫోన్లో బెదిరింపులకు పాల్పడటంతో పార్టీ శ్రేణులు అండగా నిలబడ్డాయి. వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేనీ సీతారాం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి బస్టాండ్, మార్కెట్, పోస్టాఫీసు, జూనియర్‌ కళాశాల మీదుగా పోలీసు స్టేషన్‌ వరకు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. విప్‌ కూన రవికుమార్‌ డౌన్‌ డౌన్‌.. దౌర్జన్యం నశించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎస్‌ఐ బాలరాజు లేరని హెచ్‌సీ బాదుషా చెప్పడంతో అక్కడే బైఠాయించారు. ఎస్పీ, ఎస్‌ఐలతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం హెడ్‌ కానిస్టేబుల్‌కు ఫిర్యాదునిచ్చి రసీదును తీసుకున్నారు. ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌తో  ప్రాణభయం ఉందని, తనకు రక్షణ కల్పించాలని శివకుమార్‌ పోలీసులను కోరారు. అనంతరం మహారాజా మార్కెట్‌కు వెళ్లి బహిరంగ సమావేశం నిర్వహించారు.

బహిరంగ చర్చకు సిద్ధమా..
ఈ సందర్భంగా తమ్మినేనీ సీతారాం మాట్లాడుతూ రవికుమార్‌ వ్యవహారం ఆరిపోయే ముందు వెలుగుతున్న దీపంలా ఉందని విమర్శించారు. ఓటమి భయంతోనే బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికిపోయినట్లు.. ఇప్పుడు రవికుమార్‌ అడ్డంగా బుక్కయ్యారని పేర్కొన్నారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. అయినా బీసీ కార్పొరేషన్‌ రుణం ఇప్పించాననడం విప్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలకు హానితలపడితే సహించేది లేదన్నారు. ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ మాట్లాడుతూ రౌడీరాజకీయాలు చేసి లబ్ధిపొందాలంటే పొందూరు మండలంలో కుదరదని చెప్పారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు పప్పల వెంకటరమణమూర్తి మాట్లాడుతూ గొయ్యితీసి పాతేసే రాజకీయాలు తమ వద్ద చెల్లవన్నారు. చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు కోరుకొండ సాయికుమార్‌ మాట్లాడుతూ దిగుజారుడు రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. మాజీ సర్పంచ్‌ గంగిరెడ్ల ఉమాదేవి మాట్లాడుతూ పొందూరులో బాలకృష్ణ డైలాగులు చెబితే జడిసేవారు లేరన్నారు. బాదితుడు శివకుమార్‌ మాట్లాడుతూ తమ్మినేనీ సీతారాం, సువ్వారి గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నానని, తానెవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గాడు నాగరాజు, నాయకులు లోలుగు కాంతారావు, బీఎల్‌ నాయుడు, యతిరాజుల జగన్నాథం, పెద్దింటి వెంకట రవిబాబు, పప్పల దాలినాయుడు, పప్పల అప్పలనాయుడు, కూన కిరణ్, తమ్మినేని మురళీకృష్ణ, బొనిగి రమణమూర్తి, అనకాపల్లి గోవిందరావు, పోతురాజు సూర్యారావు, కొంచాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా