సభను హుందాగా నడిపిస్తా: తమ్మినేని

7 Jun, 2019 16:15 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శానససభ స్పీకర్‌గా అవకాశం దక్కడం పట్ల వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనపై అపారమైన నమ్మకం ఉంచి అప్పగించిన సభాపతి బాధ్యతలను త్రికరణశుధ్ధిగా నిర్వహిస్తానని తెలిపారు. సీఎం జగన్‌ను కలిసిన తర్వాత ‘సాక్షి’ టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. స్పీకర్‌గా ప్రతిపాదిస్తున్నట్టు సీఎం జగన్‌ తనతో చెప్పగానే సంతోషంగా ఫీలయ్యానని, ఏ పదవి ఇచ్చినా ఆదేశంగా భావిస్తానని అన్నట్టు తెలిపారు.

స్పీకర్‌ పదవికి న్యాయం చేయగలననే నమ్మకం తనకుందన్నారు. సభా సంప్రదాయాలను, ప్రతిష్టను పెంచేవిధంగా నడుచుకుంటానని చెప్పారు. శాసనసభను సరైన పంథాలో నిర్వహిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు సమన్వయంతో సభను హుందాగా నడిపిస్తానని అన్నారు. తనను ఆంధ్రప్రదేశ్‌ రెండో శాసనసభాపతిగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తన ఎంపికను ‘కళింగసీమకు ఇచ్చిన కంఠాభరణం’గా తమ్మినేని సీతారాం వర్ణించారు. స్పీకర్‌గా తనను ఎంపిక చేయడం పట్ల బీసీలంతా చాలా సంతోషంగా ఉన్నారన్నారు.

మరిన్ని వార్తలు