సభ గౌరవానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు

20 Jan, 2020 04:13 IST|Sakshi

అసెంబ్లీ ముట్టడికి గానీ.. సభ్యుల్ని అడ్డుకునేందుకు గానీ ప్రయత్నిస్తే ఉపేక్షించం

సమావేశాల అజెండాను బీఏసీలో నిర్ణయిస్తాం

స్పీకర్‌ తమ్మినేని సీతారాం

సాక్షి, అమరావతి: శాసనసభ గౌరవం, ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తే రాజ్యాంగం మేరకు కఠినచర్యలు తీసుకుంటామని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం హెచ్చరించారు. సభ ముట్టడికి గానీ.. సభకు హాజరయ్యే సభ్యుల్ని అడ్డుకునేందుకు గానీ ప్రయత్నించేవారిని ఏమాత్రం ఉపేక్షించమని స్పష్టం చేశారు. విజయవాడలో ఆదివారం విలేకరులతో స్పీకర్‌ మాట్లాడుతూ.. కొందరు సీనియర్‌ సభ్యులు శాసనసభ ముట్టడికి పిలుపునివ్వడం సభ గౌరవానికి భంగం కలిగించే చర్యని స్పష్టం చేశారు. సీనియర్లమని చెప్పుకునే సభ్యులు రాజ్యాంగ వ్యవస్థలకే హెచ్చరికలు జారీ చేస్తారా? అని ప్రశ్నించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అందుకు సదరు సభ్యులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. చట్టసభల గౌరవం కాపాడేందుకు 208 అధికరణ కింద రాజ్యాంగం హక్కులు కల్పించిందన్నారు. 

సరైన పద్ధతిలో నిరసన తెలపాలి
శాసనసభ నియమావళి 354, 355, 356 ప్రకారం ఆగంతకులు సభా ప్రాంగణంలోకి ప్రవేశించడం, సభా కార్యక్రమాలను అడ్డుకునేందుకు యత్నించడం వంటివి శిక్షార్హమైన నేరాలని చెప్పారు. అలాంటి చర్యలకు పాల్పడేవారికి జైలుశిక్ష పడ్డ ఉదంతాలు ఉన్నాయని తమ్మినేని తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉందని.. అయితే అది సరైన రీతిలో  ఉండాలని వివరించారు. సభ్యులు తమ అభిప్రాయం చెప్పేందుకు చట్టసభ కల్పించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  రాజ్యాంగం కల్పించిన అత్యున్నత వేదిక ద్వారా ప్రజల మనోభావాలను వెలిబుచ్చే అవకాశం సభ్యులందరికీ ఉందని.. అంతేగానీ సభను ముట్టడిస్తాం, అడ్డుకుంటామంటే ఉపేక్షించేది లేదని స్పీకర్‌ సీతారాం చెప్పారు. 

ముందు జాగ్రత్తగానే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై శాసనసభ కూలంకషంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటుందని, సభ నిర్ణయమే అంతిమమని స్పీకర్‌ పేర్కొన్నారు సభ సజావుగా సాగేందుకు సభ్యులంతా సహకరించాలని.. సమావేశాల అజెండాను బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ(బీఏసీ)లో చర్చించి నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. సమావేశాలు రెండు మూడ్రోజులు జరిగే అవకాశముందని అన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం పోలీసుల బాధ్యతని, అందుకోసం అమరావతి ప్రాంతంలో బందోబస్తును పటిష్టం చేయడం, తనిఖీలు నిర్వహించడం, 144 సెక్షన్‌ విధించడంలో తప్పు లేదన్నారు.

మరిన్ని వార్తలు