వాస్తవాలపై ఉక్రోషం

4 Jul, 2017 01:12 IST|Sakshi
వాస్తవాలపై ఉక్రోషం

ట్యాంపరింగ్‌ కింగ్‌తో  సంబంధాలున్నా...  కాదంటూ బుకాయింపు
వార్తను ప్రచురించిన సాక్షి ప్రతులను  తగలబెట్టించిన ఎమ్మెల్యే
నిజాలు బయటికొస్తే ఉలుకెందుకని విపక్షాల విమర్శలు
కొన్ని ప్రతులను దహనపరిస్తే...సాక్ష్యాలు పోతాయా అంటూ ఎద్దేవా...


సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘పదివేలు నేనిస్తే మర్డర్‌ చేశారని మీరే రాసేస్తారు... సుధాకర్‌రాజు నాకు తెలుసు. మేం మొదటి నుంచీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌... డీలింగ్స్, ఫోన్‌ కాంటాక్టస్‌ మాత్రం లేవు.. రేపేమైనా కథనం ప్లాన్‌ చేస్తున్నారా... రేపేమీ రాదుకదా... నాతో మీకు కంఫర్ట్‌ ఉంటుంది.’.. ఇవీ గజపతినగరం టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ కె.ఎ.నాయుడు ఆదివారం రాత్రి ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్‌ చేసి అన్న మాటలు. సరిగ్గా రాత్రి 10.17 నిమిషాలకు ఫోన్‌ చేసి 3.57 నిమిషాలపాటు మాట్లాడిన ఎమ్మెల్యే అంతిమ సారాంశం తనపై ఎలాంటి కథనం రాయవద్దని. అయినా ఆయన మాటలకు భయపడి వెనకడుగు వేయకుండా సాక్షి సోమవారం ‘ఓ రాజు..ఓ నాయుడు’ కథనం ప్రచురించింది.

ఆ కథనంతో ఉక్రోషంతో ఊగిపోయిన ఎమ్మెల్యే గజపతినగరం నియోజకవర్గంలోని గంట్యాడ మండలంలో తన అనుచరగణం చేత ‘సాక్షి’ ప్రతులను తగులబెట్టించారు. సాక్ష్యాలు ఉంటే బయటపెట్టాలని, తప్పుడు వార్తలు రాయవద్దని గజపతినగరంలో స్థానిక నేతల చేత మాట్లాడించారు. అయితే సాక్ష్యం లేకుండా ‘సాక్షి’ కథనం రాయలేదని పత్రిక చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమైంది. భూముల రికార్డులను ట్యాంపర్‌ చేసి విశాఖ పోలీసులకు చిక్కిన సుధాకర్‌రాజుతో ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు సన్నిహితంగా ఉన్న ఫొ టోను ‘సాక్షి’ ప్రాధమిక ఆధారంగా బయటపెట్టింది. అంతేగాదు... ఎమ్మెల్యే వివరణను సైతం కథనానికి జతచేసింది. అయినప్పటికీ ఎమ్మెల్యే అడ్డంగా బుకాయించడంపై అతని నియోజకవర్గంలోనే కాదు... జిల్లా వ్యాప్తంగా జనం నవ్వుకుంటున్నారు.

కుటుంబ స్నేహం..కానీ మాట్లాడుకోరంట:
సుధాకర్‌ రాజు తనకు ఫ్యామిలీ ఫ్రెండ్‌ అని చెబుతున్న ఎమ్మెల్యే మరోవైపు అతనితో ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేవని చెప్ప డం, కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడింది లేదనడం నమ్మలేని నిజాల ని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. తన నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి సమాజంలో నాలుగో స్తంభంగా నిలిచే పత్రిక ప్రతులను దహనం చేయడంపై జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలూ మండి పడుతున్నాయి. అలా చేయడం ద్వారా సాక్షాత్తూ ఎమ్మెల్యేనే రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారని ఖండిస్తున్నారు.

 మరోవైపు విపక్షాలు సైతం ఎమ్మెల్యే దుశ్చర్యపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గతం నుంచీ ఎన్నో ఆరోపణలు ఎ దుర్కొంటున్న ఎమ్మెల్యే దీనిపై అనుసరించిన వైఖరిని తప్పు పడుతున్నాయి. సుధాకర్‌రాజు కుటుం బంతో ఎమ్మెల్యేకున్న సంబంధాలు ప్రజలందరికీ తెలిసినవేనని, ఇప్పుడు అడ్డంగా దొరికి బుకాయిస్తే ఎవరూ నమ్మరని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇదిలా ఉండగా సుధాకర్‌రాజును అరెస్ట్‌ చేసిన విశాఖ పోలీసులు ఓ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. దానిలో జిల్లాకు చెందిన టీడీపీ నేతల పేర్లు ఉన్నాయని తాజా సమాచారం. ఆ వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.

భుజాలు తడుముకోవడం ఎందుకు
వార్త వస్తే భుజాలెందుకు తడుముకుంటున్నారు. పత్రికలు తగలబెడితే నిజాలు మాసిపోతాయా... విశాఖ భూకుంభకోణంలో నిజంగా తనకు ప్రమేయం లేదని రుజువు చేసుకోవాలి.
– గదల సన్యాసినాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు, నెల్లిమర్ల

రుజువు చేసుకోవాలి
విశాఖపట్నం భూకుంభకోణంలో గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని రుజువు చేసుకోవాలి. సాక్షి పత్రికపై కక్షసాధింపు చర్యకు దిగడం సమంజసం కాదు.
– కె.ఎన్‌.ఎం.కృష్ణారావు, బీజేపీ నెల్లిమర్ల ఇన్‌చార్జ్‌

మరిన్ని వార్తలు