వైసీపీ కార్యవర్గంలో ఐదుగురికి చోటు

6 Sep, 2014 00:50 IST|Sakshi

సాక్షి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి అగ్ర తాంబూలం దక్కింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే తానేటి వనితను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అదే విధంగా పార్టీ కేంద్ర పాలక మండలిలోనూ జిల్లాకు ప్రాధాన్యత దక్కింది. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యేలు పెండ్యాల వెంకట కృష్ణారావు(కృష్ణబాబు), జీఎస్ రావులతో పాటు ఇటీవల ఏలూరు, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన తోట చంద్రశేఖర్, వంక రవీంద్రలను కేంద్ర పాలక మండలి సభ్యులుగా ప్రకటించారు.
 
మహిళకు దక్కిన గౌరవం
తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు గోపాలపురం ఎమ్మెల్యేగా 1994, 99లో రెండు పర్యాయాలు పనిచేశారు. తండ్రి వారసత్వంతో 2009లో వనిత రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ ఏడాది గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
 
అప్పటి నుంచీ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. 2014 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి శాసనసభకు పోటీ చేశారు. ఎమ్మెస్సీ, ఎంఈడీ చదువుకున్న వనిత కొంత కాలం నల్లజర్లలోని సహకార జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలిగా సేవలందించారు. ఆమె భర్త శ్రీనివాసరావు తాడేపల్లిగూడెంలో ప్రముఖ వైద్యులుగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన మీద ఉన్న నమ్మకంతో బాధ్యత అప్పగించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కేడర్‌లో నూతనోత్సాహం నింపి పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తానని ఈ సందర్భంగా వనిత పేర్కొన్నారు.
 
సీనియర్లకు అగ్రస్థానం
కృష్ణబాబు కొవ్వూరు ఎమ్మెల్యేగా ఐదు పర్యాయాలు పనిచేశారు. మెట్ట ప్రాంతంలో ముఖ్యనాయకుడిగా ఉంటూ జిల్లా రాజకీయాలను నడిపించారు. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జీఎస్ రావు 1999లో కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో పట్టున్న నేతగా ఎదిగారు. పీసీసీ అధ్యక్షుడిగా ఆరు నెలలు పనిచేసిన అనుభవజ్ఞులు. తోట చంద్రశేఖర్ ఐఏఎస్ అధికారిగా దేశంలో పలు ప్రాంతాల్లో పనిచేసి, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. రవీంద్ర పారిశ్రామిక వేత్తగా ఉంటూ పార్టీకి సేవలందిస్తున్నారు.

మరిన్ని వార్తలు