అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే..

15 Sep, 2019 14:31 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్‌ చేసి కాపు ఉద్యమాన్ని చంద్రబాబు అణిచివేసినప్పుడు కూడా నోరుమెదపని పవన్‌ కల్యాణ్‌.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎనభై శాతం హామీలను నెరవేర్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వర్‌ రావు విమర్శించారు. వైఎస్‌ జగన్‌ పాలనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుక్‌లెట్‌ విడుదల చేయడంపై ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. అవినీతి, దోపిడీ లేని పాలన అందిస్తుంటే టీడీపీ, జనసేనలకు మింగుడుపడడం లేదన్నారు. చంద్రబాబు పాలనలో ఆరు వందల హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోయినా అడగని పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు మాట్లాడటంలో ఆయన విజ్ఞత ఏంటో తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

పుష్కరాల్లో 29 మంది చనిపోయినప్పుడు కూడా పెదవి విప్పని పవన్‌ కల్యాణ్‌కు గత ప్రభుత్వం తొమ్మిది నెలలు ఇసుక దొరక్కుండా చేసిన విషయం తెలీదా? అని సూటిగా ప్రశ్నించారు. రూపాయి కూడా లేకుండా చంద్రబాబు ఖజానా ఖాళీ చేసి అప్పజెప్పాడని, వైఎస్‌ జగన్‌ ఎంతో ఓర్పుతో ప్రతీ హామీని నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో వాలంటీర్లుగా ఇప్పటికే ఐదు లక్షల అరవై ఉద్యోగాలు, సుమారు రెండు లక్షల గ్రామ సెక్రటేరియట్‌ ఉద్యోగాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. త్వరలో పెద్ద ఎత్తున కానిస్టేబుల్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తెలిపారు. మంచి పనులు చేస్తుంటే మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ ఇలా విషం చిమ్మవద్దని పవన్‌ కల్యాణ్‌కు హితవు పలికారు.     

మరిన్ని వార్తలు