బైక్‌పై టాంజానియా విద్యార్థి హల్‌చల్‌

24 Aug, 2019 08:53 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి(గుంటూరు) : మండల పరిధిలోని ఉండవల్లి గ్రామంలో శుక్రవారం టాంజానియా విద్యార్థి తన ద్విచక్రవాహనంపై హల్‌చల్‌ చేస్తూ, అతి వేగంగా వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న ఓ వృద్ధుడ్ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై వృద్ధుడి పరిస్థితి విషమంగా మారింది. వడ్డేశ్వరం కె.ఎల్‌.విశ్వ విద్యాలయంలో టాంజానియా దేశానికి చెందిన ఆల్మెట్‌ బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఉండవల్లిలో నివాసం ఉండే ఆల్మెట్‌ తన ద్విచక్రవాహనంపై కాలేజీకి వెళ్లివస్తుంటాడు. కృష్ణాష్టమి కావడంతో కాలేజీకి సెలవు ప్రకటించారు. దీంతో ఆల్మెట్‌ తన ద్విచక్రవాహనంపై ఉండవల్లి–అమరావతి రహదారిలో ఫీట్లు చేస్తూ అతి వేగంగా ద్విచక్రవాహనాన్ని నడిపాడు.

ఈ క్రమంలో ఉండవల్లి సెంటర్‌ నుంచి గ్రామంలోకి వెళుతున్న ఆర్‌.శంకరరెడ్డి (పిడతలు) తన సైకిల్‌పై వెళుతూ ఉండగా, వెనుక నుంచి ఆల్మెట్‌ ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. శంకర్‌రెడ్డి సైకిల్‌పై నుంచి రోడ్డు మీద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆల్మెట్‌ అదే వేగంతో ముందుకు దూసుకుపోగా, రోడ్డు పక్కన ఉన్న మార్బుల్‌ దుకాణంలోకి ద్విచక్రవాహనం దూసుకువెళ్లి, మార్బుల్‌ రాళ్లను గుద్ది కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆల్మెట్‌కు కూడా గాయాలయ్యాయి. రోడ్డు పక్కనే ఉన్న మార్బుల్‌రాళ్లు 12 వరకు పగిలిపోయాయి. ఘటనా స్థలం వద్ద రాళ్లు పగిలిన తీరునుబట్టి ఆల్మెట్‌ ఎంత వేగంతో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. 24 గంటలు గడిస్తే కాని పరిస్థితి చెప్పలేమంటూ డాక్టర్లు చెప్పడంతో శంకరరెడ్డి బంధువులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు.  

మరిన్ని వార్తలు