ఇంటింటికీ మంచినీరు!

12 Sep, 2019 13:09 IST|Sakshi

పైప్‌లైన్‌ ద్వారా సరఫరాకు కసరత్తు

రూ.6 వేల కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ పథకం

సమగ్ర ప్రణాళిక తయారు చేసిన

ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు

గ్రామీణ, మైదాన, మన్యం ప్రాంతాల్లో ప్రజలకు మంచినీటి కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఇంటింటికీ తాగునీరు అందించే పథకానికి జిల్లా గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రిజర్వాయర్ల నుంచి పైప్‌లైన్‌లు వేసి..వాటి ద్వారా నీటిని సరఫరా చేసేలా సమగ్ర ప్రణాళిక తయారు చేశారు. ఆరు వేల కోట్ల రూపాయలతో రూపొందిస్తున్న ఈ పథకానికి వాటర్‌ గ్రిడ్‌ అని పేరు పెట్టారు.  

మహారాణిపేట (విశాఖ దక్షిణ): జిల్లా ప్రజలకు మంచినీటి కష్టాలు త్వరలో తీరనున్నాయి. వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా ఒకరికి నెలకు 100 లీటర్లు అందించేలా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఈ పథకాన్ని రూపొం దించారు. ఎక్కువ ప్రాంతాలకు సులువుగా నీరు అందించేలా.. సమీపంలో ఉండే రిజర్వాయర్‌ నుంచి సమీప ప్రాంతాలకు పెద్ద పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేసేలా సమగ్ర ప్రణాళికను సంబంధిత అధికారులు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత దీన్ని అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లాలో గ్రామీణ, మైదాన, మన్యం ప్రాంతాల్లో  5,597 నివాస గ్రామాలున్నాయి. ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు సురక్షితమైన తాగునీరు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వినిగియోగిస్తున్న తాగునీరు సురక్షితంగా లేకపోవడంతో ప్రజలు అనా రోగ్యం బారినపడుతున్నారు. ఈ సమస్య నుంచి ప్రజలు బయటపడేలా వాటర్‌గ్రిడ్‌ పథకం ద్వారా మంచినీటిని సరఫరా చేసేలా ప్రణాళిక తయారు చేసినట్టు జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారి రవికుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు. మైదాన ప్రాంతాల్లో ఉన్న పెద్దేరు, కల్యాణపులోవ, తాండవ, కోనాం, ఎన్టీఆర్‌ రిజర్వాయరు, ఏలేరు రిజర్వాయర్ల నుంచి పైపులైన్లు ద్వారా నీటి అందించేలా అధికారులు ఆలోచన చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కేంద్రంగా రక్షిత ట్యాంకు నిర్మాణం చేపట్టి దానికి పైపులైన్‌ను అమర్చి ఇంటింటికీ కనెక్షన్లు ఇచ్చి నీటిని అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పథకానికి మొత్తం ఆరు వేల కోట్ల రూపాయలు అవసరంగా అధికారులు అంచనా వేశారు. అయితే ఏలేరు కాలువ ద్వారా జిల్లా మొత్తానికి ఈ పథకం అమలు చేస్తే ఈ వ్యయం 4500 కోట్లు తగ్గుతుందని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు   అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్‌ఆర్‌జీఎస్‌ పథకం స్థానికంగా అవసరమయ్యే   పనులు చేపడితే వ్యయం మరింత తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

మన్యంలో ఇలా..
మన్యం పరిధిలోని 11 మండలాల్లో ఎలాంటి రిజర్వాయర్లు లేవు. దీంతో స్థానింగా ఉన్న నీటి వనరులకు అనుసంధానం చేస్తూ పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే భారీగా బోర్‌వెల్‌ నిర్మించి.. వాటి ఆధారంగా గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న రక్షిత ట్యాంకులకు నీటిని మళ్లించి..దానిఆధారంగా ఇంటింటికీ నీటిని సరఫరా చేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రవికుమార్‌ తెలిపారు.

ఫ్లోరైడ్‌ గ్రామాలపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో కలుషిత నీరు, ఫ్లోరైడ్‌ నీరు ఉన్న గ్రామాలపై కూడా అర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని సుమారు 20 గ్రామాల్లో నీరు పనికి రాకుండా ఉంది. తాగునీటిలో ఒక లీటర్‌ నీటిలో 1.5 మిల్లీగ్రాముల  ఫ్లోరైడ్‌ ఉండాలి. కాని ఈ గ్రామాల్లో అంతకంటే ఎక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఈ గ్రామాలకు కూడా తాజాగా చేపట్టనున్న వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా నీటిని అందించేందుకు అధికారులు ఆలోచన చేస్తున్నారు.

మరిన్ని వార్తలు