పాత టార్గెట్...కొత్త విజన్ !

8 Aug, 2014 03:50 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: విజన్ 2020 పేరుతో రాష్ట్రాన్ని స్వ ర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తానని గతంలో ప్రకటించిన చంద్రబాబు పాత టార్గెట్‌కు చేరుకునేందుకు కొత్త విజన్ రూపొందించుకున్నారు. ఇప్పుడు విజన్ 2029 పేరుతో స్వర్ణాంధ్రప్రదేశ్‌ను చేసేందుకు ఏడు అంశాలతో ‘సెవెన్ మిషన్’ ప్రకటించారు. అభివృద్ధి కోసం ఏడు అంశాలను రూపొందించి, వాటి కార్యసాధనకు ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయ ట్రస్టీలు, దాతల నుంచి విరాళాలు సేకరించి ముందుకె ళ్తామని విజయవాడలో గురువారం జరిగిన కలెక్టర్ల సమీక్షలో ‘బాబు’ ప్రకటించారు. అయితే చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఎలాంటి శ్రద్ధ తీసుకోలేదు.
 
జిల్లా కలెక్టర్లతో పాటు అన్నిశాఖల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహించిన చంద్రబాబు జిల్లా అభివృద్ధి కోసం జిల్లాల వారీగా ప్రత్యేక మిషన్ రూపొందిస్తారని భావించారు. అయితే ‘కలిపికొట్టరా కావేటి రంగా!’ అన్నట్లు 13జిల్లాల అభివృద్ధికి ఏడు అంశాలతో ఓ మిషన్ ప్రకటించి, దానికి తాను చైర్మన్‌గా, కొందరు మంత్రులను వైస్ చైర్మన్లుగా నియమించారు. 13 జిల్లాల్లో ఏ జిల్లా ఎంత వెనుకబడి ఉంది? ఏ జిల్లాలో ఎలాంటి ఆర్థిక వనరులున్నాయి ? జిల్లా నైసర్గిక స్వరూపం, ఆర్థిక వనరులు, ప్రకృతి సంపద నేపథ్యంలో ఏ జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలి ? వాటికి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏంటి? అనే దిశగా చర్చ జరుగుతుందని అంతా భావించారు.

కానీ సమావేశం మరోలా జరగడంతో జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టంకాలేదు. దీనిపై జిల్లా అధికారులు కూడా తలలుపట్టుకుంటున్నారు. అలాగే రాబోయే 20 ఏళ్లలో 664 మండలాలను నగరాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మండలాన్ని నగరం చేయడం అం టే ఏమిటో ? అది 20 ఏళ్లలో ఎలా సాధ్యపడుతుందో అర్థం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
 
విజన్ 2029 సాధనకు ప్రభుత్వం ప్రకటించిన మార్గం ఇదే..

 
విజన్ 2029 పేరుతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసేందుకు చంద్రబాబు ప్రకటించిన విజన్ ఇలా ఉంది. ఏడు అంశాలతో ఓ మిషన్ ఏర్పాటు చేశారు. ప్రతీ మిషన్‌కు ప్రత్యేక సెక్రటేరియట్‌తో పాటు ఓ సీఈఓను నియమిస్తారు. అలాగే అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన నిపుణులను, ప్రముఖులను సభ్యులుగా తీసుకుంటారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాలు సలహామండలిగా పనిచేస్తాయి. వీటి నిర్వహణను రాష్ట్రస్థాయిలో మంత్రులతో పాటు సీఈఓ, ప్రత్యేక సెక్రటేరియట్ పనిచేస్తుంది. అలాగే జిల్లాస్థాయిలో ఏడు మిషన్లకు కలెక్టర్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. అలాగే ఎంఐఎంయూ జిల్లా స్థాయిలో స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రణాళికలను అమలు చేస్తుంది. ఇది కలెక్టర్ కోఆర్డినేషన్‌లో పనిచేస్తుంది. అన్నిశాఖల సమన్వయంతో ప్రతీ మిషన్ పనిచేయాలి.

ఈ ఏడు అంశాలపై సమావేశంలో పవర్‌పాయింట్ ద్వారా కలెక్టర్లకు అవగాహన కల్పించారు. అలాగే వీటి పనితీరు, సమాచార సేకరణ రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) ద్వారా జరుగుతుంది. ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను 2014-2019కి పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఇదే పంథాలో రాష్ట్రాన్ని 2022కు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ‘ఇండియా ఎట్-75’గా ఎదగాలని సూచించారు. 2029కి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నారు. ఈ కాలంలో మూడు మెగా సిటీలను, 12 పట్టణాలను నగరాలుగా అభివృద్ధి చేయనున్నారు. మూడు మెగాసిటీల్లో తిరుపతి కూడా ఉండడం విశేషం.

 ఏడు మిషన్లు ఇవే..
 1. ప్రాథమికరంగ మిషన్: వ్యవసాయ అభివృద్ధి కోసం పనిచేస్తుంది.
 2. ఉత్పత్తిరంగ మిషన్: జీఎస్‌డీపీని పెంచేందుకు పనిచేస్తుంది. అంటే ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేకంగా పనిచేస్తుంది.
 3. మౌలిక వసతుల రంగం: అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతుల కల్పన, కొత్త వాణిజ్య అవకాశాలు కల్పించేందుకు పనిచేస్తుంది.
 4. సేవారంగ మిషన్: ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు పనిచేస్తుంది.
 5. పట్టణాభివృద్ధి మిషన్: రాష్ట్రంలో 3 మెగాసిటీలు, 12 పట్టణాలను సిటీలుగా మార్చడం, 20 ఏళ్లలో 664 మండలాలను నగరాలుగా అభివృద్ధి చేస్తారట.
 6. నైపుణ్య వృద్ధి(స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్): ఉపాధి అవకాశాలను పెంచడం
 7. సాధికారిత మిషన్: స్త్రీ, శిశు సంక్షేమం కోసం పనిచేస్తుంది.
 
చిత్తూరు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఏదీ?
సమావేశంలో చిత్తూరు గురించి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ సిద్ధార్థ జైన్ సమగ్ర ప్రణాళికతో సిద్ధమై వెళ్లారు. అయితే చిత్తూరుపై సీఎం ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. అయితే సమావేశం అనంతరం కుప్పం అభివృద్ధిపై మరోసారి రాజధానిలో సమీక్ష నిర్వహిద్దామని కలెక్టర్‌కు సూచించినట్లు తెలిసింది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా