పునరేకీకరణే కమ్యూనిస్టుల కర్తవ్యం

5 Mar, 2015 02:00 IST|Sakshi
పునరేకీకరణే కమ్యూనిస్టుల కర్తవ్యం

సీపీఐ రాష్ట్ర మహాసభల ప్రారంభోత్సవ సభలో సురవరం
(విజయవాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొనివున్న సంక్షుభిత పరిస్థితుల్లో కమ్యూనిస్టుల పునరేకీకరణే తక్షణ ఆవశ్యకత అని సీపీఐ ప్రకటించింది. అభివృద్ధికి కమ్యూనిస్టులు ఆటంకమనే వాదనను తోసిపుచ్చింది. రాష్ట్ర విభజనాంతరం సీపీఐ ఆంధ్రప్రదేశ్ తొలి రాష్ట్ర మహాసభ, ఉమ్మడిగా చూస్తే 25వ రాష్ట్ర మహాసభను పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి బుధవారమిక్కడ ప్రారంభించారు. మహాసభల ప్రారంభ సూచకంగా పార్టీ సీనియర్ నేత, విశాలాంధ్ర పూర్వ సంపాదకులు చక్రవర్తుల రాఘవాచారి అరుణపతాకాన్ని ఆవిష్కరించారు.
 
 అనంతరం పార్టీ రాష్ట్ర నేతలు జల్లి విల్సన్, జి.దేవుడు, జి.ఈశ్వరయ్య, వి.జయలక్ష్మీ, కరీముల్లా, మునీర్ అధ్యక్షవర్గంగా వ్యవహరించిన సభలో సురవరం ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలో భ్రష్టుపట్టిపోయిన కాంగ్రెస్ స్థానంలో దేవదూతగా అభివర్ణించిన మోదీ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే సామాన్యుల పాలిట భూతంగా అవతరించారని సురవరం ధ్వజమెత్తారు. మోదీ పాలనలో భావ ప్రకటనకు, లౌకికత్వానికి ముప్పు ఏర్పడిందని విమర్శించారు.
 
 అంతర్మథనం చేసుకుంటున్నాం..
 తాము చేసిన కొన్ని పొరబాట్లవల్ల నష్టపోయామని సురవరం అంగీకరించారు. అయితే ఇప్పుడు అంతర్మథనం చేసుకుంటున్నామని, కమ్యూనిస్టుల్ని ఏకం చేసేపనిలో పడ్డామని వివరించారు.
 
 గాంధీని జాతిపిత అన్నదే మేము
 గాంధీని జాతిపిత అని తొలుత అన్నది కమ్యూనిస్టులేననీ అప్పటి తమ పార్టీ ప్రధాన కార్యదర్శి పీసీ జోషి ఓ సందర్భంలో తొలిసారిగా.. గాంధీని జాతిపితగా పిలిచారన్నారు.
 
 సీపీఐని వీడని విభజన గాయాలు
 ఈ సందర్భంగా సీపీఐ నేత రామకృష్ణ గుండా మల్లేశ్‌నుద్దేశించి చేసిన వ్యాఖ్యలు ముఖ్య నేతలను ఇబ్బందులకు గురిచేశాయి. రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయనను ఆహ్వానించడం చర్చనీయాంశమైంది.
 
 ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి
  రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారమిక్కడ ప్రారంభమైన సీపీఐ ఏపీ 25వ రాష్ట్ర మహాసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని సీపీఐ మహాసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. నిధులు రావని తెలిసే చంద్రబాబు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తీసుకువచ్చారంది.
 
 చంద్రబాబుపై మండిపాటు
 అధికారంలో లేనప్పుడు వామపక్షాలతో అంటకాగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తర్వాత ప్లేటు ఫిరాయించి పచ్చి మతతత్వ శక్తులతో చేతులు కలిపాడని సీపీఐ విమర్శించింది. కాగా కార్యదర్శి నివేదికపై చర్చ గురువారం కూడా కొనసాగుతుంది. కార్యదర్శి రామకృష్ణ చర్చకు జవాబిస్తారు. సాయంత్రం నూతన కార్యవర్గ ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుత కార్యదర్శినే తిరిగి కొనసాగించే అవకాశముంది.

మరిన్ని వార్తలు