నైపుణ్యాభివృద్ధిపై టాస్క్‌ఫోర్స్‌

24 Sep, 2019 09:18 IST|Sakshi

విధివిధానాల రూపకల్పనకు ముగ్గురు సభ్యులతో ఏర్పాటు

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి విధివిధానాలు, మార్గదర్శకాల రూపకల్పనకు ముగ్గురు సభ్యులతో టాస్క్‌ ఫోర్సు కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 13న పరిశ్రమల రంగంపై జరిగిన సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి చైర్మన్‌గా, విద్యాశాఖ మంత్రిని కో–చైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కన్వీనర్‌గా నియమిస్తున్నట్టు రాష్ట్ర ఐఐఐ అండ్‌ సీ ముఖ్య కార్యదర్శి రజత్‌భార్గవ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అనుబంధ సభ్యులతో పాటు.. ప్రత్యేక ఆహ్వానితులను నియమించుకునే అవకాశాన్ని టాస్క్‌ఫోర్స్‌కి కల్పించారు. రాష్ట్రంలో ప్రస్తుత మానవ వనరుల నైపుణ్యంపై వాస్తవ పరిస్థితితో పాటు.. కొత్తగా ప్రవేశపెట్టే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎటువంటి సిలబస్‌ను రూపొందించాలన్న అంశాలపై ఈ టాస్క్‌ఫోర్స్‌ అధ్యయనంచేసి తొలి సమావేశమైన ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రస్తుతం రాష్ట్రంలోని నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో అనుసరిస్తున్న విధానాల్లో లోపాలను గుర్తించడంతో పాటు.. ఈ రంగంతో సంబంధం ఉన్న ఏపీఎస్‌ఎస్‌డీసీ, ఎస్‌ఈఈడీఏపీ, విద్యా సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు, ప్రధాన పెట్టుబడిదారులతో సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలను రూపొందించాలి. అలాగే  పార్లమెంటు పరిధిలో ఈ కేంద్రం ఏర్పాటుకు సామర్థ్యం ఉన్న విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థలను గుర్తించడంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఈ సంస్థలో శిక్షణ ఇవ్వడానికి అనుభవం ఉన్న ట్రైనీలను గుర్తించడం, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించేలా సిలబస్‌ను రూపొందించడం, నిర్దిష్ట కాలపరిమితిలోగా శిక్షణ పూర్తయ్యేట్లు కార్యక్రమం రూపొందించడం, శిక్షణ పూర్తిచేసుకున్న యువతకు ఉపాధి లభించాక వారి పనితీరును పరిశీలించడం వంటివి ఈ టాస్క్‌ఫోర్స్‌ ప్రధాన లక్ష్యం.

మరిన్ని వార్తలు