టాస్క్‌ఫోర్స్ అదుపులో ఎర్రచందనం స్మగ్లర్లు

25 Aug, 2013 06:53 IST|Sakshi

 తిరుపతి, సాక్షి: ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ జైలుకు వెళ్లిన వారిపైన ఐదు జిల్లాల పరిధిగా పని చేస్తున్న ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా వెంకటగిరికి చెందిన ఇద్దరు కీలక స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని మూడు రోజుల క్రితం వెంకటగిరిలో అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు నేడో రేపో అరెస్టు చూపేందుకు శుక్రవారం రాత్రి అలిపిరి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.
 
 వెంకటగిరి పరిసరాల్లో మొత్తం ఐదుగురు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం ఉండటంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు రోజుల క్రితం వెంకటగిరిలో దాడి చేసి ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఎంత కాలంగా స్మగ్లింగ్ చేస్తున్నారు, నరికిన దుంగలను ఎక్కడికి రవాణా చేస్తారు? చెన్నైలో ఉన్న ప్రధాన స్మగ్లర్లతో వీరికి ఉన్న సంబంధాలు ఏంటనే అంశాలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు వివరాలు రాబట్టినట్లు సమాచారం. స్మగ్లర్ల అరెస్టుతోపాటు రెండు టన్నులకుపైగా ఎర్రచందనం దుంగలను ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ దృష్టి సారించడంతో ఈ ఇద్దరు కీలక స్మగ్లర్లు పట్టుబడ్డారు. తిరుపతి రేంజ్‌లోని కరకంబాడి-చైతన్యపురం మధ్యలో అటవీశాఖ వైల్డ్‌లైఫ్ అధికారులు రూ.8 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలు, లారీని స్వాధీనం చేసుకున్నారు.
 
 బాలపల్లె అడవుల్లో కూంబింగ్
 టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ ఉదయకుమార్, వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు, అటవీ సాయుధ బలగాలు ఎస్వీ వైల్డ్‌లైఫ్ డివిజన్‌లోని బాలపల్లె అడవుల్లో విస్తృతంగా ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఈ కూంబింగ్ కొనసాగించనున్నారు. బాలపల్లె నుంచి అడవిలో సుమారు 18 కిలోమీటర్ల పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఎర్రచందనం వృక్షాలు ఉన్న ప్రాంతంలో ఈ విస్తృత కూంబింగ్ చేపట్టారు. ఎర్రచందనం వృక్షాలు నేలకూలకుండా నిరోధించేందుకే ఈ సంయుక్త కూంబింగ్ చేపట్టినట్లు డీఎఫ్‌వో శ్రీనివాసులు ‘సాక్షి’కి తెలిపారు. వైల్డ్‌లైఫ్ డివిజన్ పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్ పూర్తిగా అరికట్టే లక్ష్యంతో ఇక నుంచి టాస్క్‌ఫోర్స్, అటవీ అధికారులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
 
 

మరిన్ని వార్తలు