ఆపరేషన్ ‘రెడ్’లో పెద్ద చేపలు!

11 Nov, 2014 01:46 IST|Sakshi
ఆపరేషన్ ‘రెడ్’లో పెద్ద చేపలు!

చిత్తూరు (అర్బన్): టాస్క్‌ఫోర్స్ పోలీ సులు నిర్వహించిన ఆపరేషన్‌రెడ్‌లో ఇద్దరు బడా ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ లో ఏటా రూ.కోటికిపైగా సంపాదించే జిల్లాకు చెందిన నిమ్మ మహేష్ (39), శ్రీ పొటిశ్రీరాములు నెల్లూరుకు చెందిన ఉదయ భాస్కర్ అనే రవికుమార్ (50)లు ఉన్నారు. వీరితోపాటు టీ.వెం కటరెడ్డి (26), సూరిబాబు (36), రమేష్‌రెడ్డి (26), నరసింహారెడ్డి (25), విష్ణువర్దర్‌రెడ్డి (35), రామకృష్ణారెడ్డి (44), శ్రీధర్‌రెడ్డి (40), దామోదర్ నా యుడు (35)ను అరెస్టు చేశారు. వీరిలో ఓ టీవీ చానల్ అసిస్టెంట్ డెరైక్టర్, మరో ఎడిటర్ కూడా ఉండటం గమనా ర్హం.

సోమవారం చిత్తూరులోని జిల్లా పోలీసు అతిథిగృహంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఎస్పీ శ్రీని వాస్, చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు ఈ వివరాలను వెల్లడించారు. నిందితు లనుంచి అంబాసిడర్ కారు, మినీ లారీ, టాటా-407, ఓ ల్యాప్‌టాప్, రూ.12,373, 23 ఎర్ర చందనం దుంగలను పుంగనూరు, పూతలపట్టు ప్రాం తాల్లో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.50లక్షల వరకు ఉంటుం దని ఎస్పీ తెలిపారు. ఆపరేషన్ రెడ్‌లో పాల్గొన్న బృందానికి రివార్డులు సైతం ఇవ్వనున్నట్లు ఎస్పీ తెలిపారు. పట్టుబడ్డ నిందితుల వివరాలు పరిశీలిస్తే...

వెంకటరెడ్డి:  ఇతను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. హైదరాబాదులోని అమీర్‌పేటలో నివాసం ఉంటున్నాడు. పదో తరగతి వరకు చదువుకున్న ఇతను ప్రముఖ టీవీ చానల్‌లో ప్రసారమయ్యే ఓ సీరియల్‌కు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశాడు. విష్ణువర్దన్‌రెడ్డి ద్వారా ఎర్రచందనం వ్యాపారంలోకి వచ్చాడు. ఇప్పటివరకు ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి.
 రమేష్‌రెడ్డి : వైఎస్సార్ జిల్లా లింగాలదిన్నెకు చెందిన ఇతను ఐదో తరగతి చదువుకున్నాడు. వృత్తిరీత్యా రైతు. తొందరగా డబ్బు సంపాదించాలని గతేడాదిగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇతనిపై జిల్లాలో ఐదు కేసులు ఉన్నాయి.

నరసింహారెడ్డి: ఇతనిది  వైఎస్సార్ జిల్లా లింగాలదిన్నె. ఏడో తరగతి వరకు చదువుకుని పొలం పనులు చూసుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి ద్వారా స్మగ్లింగ్‌లోకి వచ్చాడు. ఇతనిపై నాలుగు కేసులు ఉన్నాయి. ఇతని తమ్ముడు బంగారురెడ్డి పెద్ద ఎర్రచందనం స్మగ్లర్ కావడం గమనార్హం.

సూరిబాబు:  మచిలీపట్నానికి చెందిన ఇతడు హై దరాబాదులో నివాసం ఉంటున్నాడు. పదో తరగతి తరువాత ఐటీఐ చేసిన ఇతను ఓ తెలుగు టీవీ ఛానల్ లో ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన కృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి ద్వారా ఎర్రచందనం వ్యాపారంలోకి వచ్చాడు. ఇతనిపై నాలుగు కేసులు ఉన్నాయి.
 
విష్ణువర్థన్‌రెడ్డి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వింజమూరుకు చెందిన ఇతను హైదరాబాద్‌లోని చైతన్యనగర్‌లో కాపురం ఉంటున్నాడు. డిగ్రీ చదివి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ తొమ్మిది నెలలుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి దిగాడు. ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి.
 
రామకృష్ణారెడ్డి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వింజమూరు స్వగ్రామం. ఇంటర్ వరకు చదువుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయగా లాభాలు రాలేదు. 2008 నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో మధ్యవర్తిగా వ్యవహరిస్తూ  ఏటా రూ.50 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇతడిపై ఐదు కేసులు ఉన్నాయి.
 
శ్రీధర్‌రెడ్డి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వింజమూరుకు చెందిన ఇతను పదో తరగతి వరకు చదివి ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు. ఐదు నెలలుగా ఎర్రచందనం తరలింపులో మధ్యవర్తిగా పనిచేస్తున్నాడు. బయటి ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయడం కూడా వృత్తిగా కొనసాగించేవాడని పోలీసుల విచారణలో తేలింది. సంవత్సరాదాయం రూ.50 లక్షలు. ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి.
 
దామోదర్‌నాయుడు: తిరుపతి న్యూ ఇందిరానగర్‌లో కాపురం ఉంటున్న ఇతను ఇంటర్ చదువుకున్నాడు. వెడ్డింగ్ ప్లానర్‌గా పనిచేసేవాడు. ఏడాదిన్నర గా ఎర్రచందనం అక్రమ రవాణాలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఇతనిపై నాలుగు కేసులు ఉన్నాయి.
 
నిమ్మ మహేష్: జిల్లాలోని పెద్దమండ్యం పాపయ్యపల్లెకు చెందిన వ్యక్తి. ఎలాంటి చదువు లేకపోయినప్పటికీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే 2007 నుంచి ఎర్ర చందనం స్మగ్లింగ్‌లోకి దిగాడు. ఆర్నెల్ల క్రితం కూడా హార్సిలీహిల్స్‌లో పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోయాడు. ఇప్పటి వరకు జిల్లా నుంచి 300 టన్నుల ఎర్రచందనం దుంగల్ని అక్రమ రవాణా చేశాడు. ఒక ఏడాదికి రూ.కోటి వరకు సంపాదించేవాడు. మహేష్‌పై జిల్లాలో 22 కేసులు ఉన్నాయి.
 
ఉదయ భాస్కర్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా హరినాథ్‌పురానికి చెందిన ఇతను ఇటీవల విజయవాడలో పట్టుపడ్డ ఎర్రచందనం డంప్‌నకు యజమాని. డిగ్రీ  చదువుకున్న ఉదయ భాస్కర్ తన పేరును రవికుమార్‌గా కూడా చెప్పుకునేవాడు. 2006లో ప్రకాశం జిల్లా నుంచి ఎర్రచందనం స్మగ్లర్ భాషాతో సంబంధాలు పెట్టుకుని వ్యాపారం ప్రారంభించాడు. ఇప్పటి వరకు 20 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు. ఇతనికి ఏటా రూ.కోటి ఆదాయం వచ్చేది. ఇతనిపై 6 కేసులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు