చేపల ప్యాకింగ్‌పై టాస్క్‌ఫోర్స్‌ తనిఖీ

3 Aug, 2018 09:52 IST|Sakshi
నారాయణపురంలో చేపల ప్యాకింగ్‌ను పరిశీలిస్తున్న శంకర్‌నాయక్, అంజలి

ఫార్మోలిన్‌ వాడకం అవాస్తవం

మత్స్యశాఖ కమిషనర్‌ శంకర్‌ నాయక్‌ వెల్లడి

ఉంగుటూరు: మండలంలోని నారాయణపురం, ఉంగుటూరు చేపల ప్యాకింగ్‌ కేంద్రాలను మత్స్యశాఖ కమిషనర్‌ రామ శంకర్‌ నాయక్‌ సమక్షంలో టాస్క్‌ఫోర్స్‌ బృందం గురువారం తనిఖీలు చేసింది. ప్యాకింగ్‌లో ఫార్మోలిన్‌ ద్రవ పదార్థాలు వాడటం లేదని గుర్తించింది. చేపల ఎగుమతుల్లో సరకు పాడవకుండా గట్టిగా ఉండేందుకు ఫార్మోలిన్‌ ద్రవ పదార్థాన్ని వాడుతున్నారని ఈశాన్య రాష్ట్రాల్లోని దిగుమతిదారుల ఆరోపణ. దీంతో పశ్చిమ బెంగాల్, అసోం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్‌కు ఇటీవల మన చేపల ఎగుమతులు తగ్గటంతో రైతులు, ప్యాకింగ్‌దారులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో చేపల ఎగుమతులపై అపోహలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్సును ఏర్పాటుచేసింది. నారాయణపురంలో రెండు ఐస్‌ ఫ్యాక్టరీలతోపాటు, ఉంగుటూరులోని ఒక ఐస్‌ ఫ్యాక్టరీలో గురువారం టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీలు చేసింది. చేపల ప్యాకింగ్, ఐస్‌ క్వాలిటీని కమిషనర్‌ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్యాకింగ్‌ చేసిన తరువాత దానిపై ప్రభుత్వం అందజేసిన స్టిక్కర్లు (ఫార్మోలిన్‌ ద్రవ పదార్థాలు వాడటం లేదని) అంటించారు.

నిడమర్రులో చెరువుల పరిశీలన
అనంతరం మత్స్యశాఖ కమిషనర్‌ శంకర్‌ నాయక్, మత్స్యశాఖ జేడీ అంజలి నిడమర్రులో చేపల చెరువులను సందర్శించారు. చెరువు నీటిని, చేపలను పరిశీలించారు. తనిఖీలో ఫుడ్‌ సేఫ్టీ అధికారి చక్రవర్తి, మత్స్య శాఖ అభివృద్ధి అధికారి గోపాలకృష్ణ, చేబ్రోలు పశు వైద్యాధికారి డాక్టర్‌ సందీప్, మత్స్య శాఖ ఎంపీఈఓలు వాసు, రాజేష్, స్వామి, సత్యనారాయణ ఉన్నారు.

సహకరించాలి
అనంతరం శంకర్‌నాయక్‌ చేపల ప్యాకింగ్‌ అసోసియేషన్‌ సభ్యులు పత్సమట్ల ధర్మరాజు, వేగేశ్న రంగరాజు, తొత్తల గణపతి, గెడ్డం శ్రీనివాసరాజుతో సమావేశమయ్యారు. చేపల ప్యాకింగ్‌లో ఫార్మోలిన్‌ ద్రవం వాడుతున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టామని, చేపల ట్రేడర్లు, ప్యాకింగ్‌ అసోసియేషన్లు సహకరించాలని కోరారు. ఎవరూ ఫార్మోలిన్‌ ద్రవ పదార్థం వాడటం లేదని చెప్పారు. ఈ సందర్భంగా ట్రేడర్లు మాట్లాడుతూ.. సుమారు 40 ఏళ్ల నుంచి చేపల వ్యాపారం చేస్తున్నామని, నాణ్య మైన  చేపలనే ఎగుమతి చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం శంకర్‌ నాయక్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఫార్మోలిన్‌ వాడడం లేదని తనిఖీ ల్లో తేలిందన్నారు. ఇప్పటికే దీనిపై ఈశాన్య రాష్ట్రాల వ్యాపారులు, ప్రభుత్వాలతో చర్చించా మని, అసోం, త్రిపుర, మేఘాలయ, పశ్చిమ బెం గాల్‌ మన చేపలపై నిషేధం ఎత్తివేయగా.. నాగాలాండ్‌ మాత్రమే కొనసాగిస్తుందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు