నిధులు అవి‘నీటి’ పాలు

4 Sep, 2019 10:18 IST|Sakshi
అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌ను ముంచెత్తిన నీరు

8 ఏళ్లు.. రూ.81 కోట్లు.. 67 లీకులు

తాటిపూడి పైపులైన్‌ నిర్మాణంలో అడుగుకో అవినీతి

పనులు పూర్తి చేయకపోయినా బిల్లుల చెల్లింపు

నిర్వహణ గాలికొదిలేసినా.. చర్యలు శూన్యం

పైపులైన్‌పైనే పలు అక్రమ నిర్మాణాలు

మరమ్మతులకు ఏటా రూ.18 లక్షల చేతిచమురు

తాజాగా బీఆర్‌టీఎస్‌ మార్గంలో పగిలిన పైపులైన్‌

తెల్లవారుజాము.. సమయం సుమారు 4 గంటలు.. వినాయక ఉత్సవాలు సంబరంగా జరుపుకొని అందరూ ఆదమరిచి నిద్రిస్తున్నారు.. ప్రశాంతంగా.. నిశ్శబ్ధంగా ఉన్న ఆ సమయంలో ఒక్కసారి పెద్ద శబ్దాలు.. జనం తుళ్లిపడి లేచారు. లేచి చూస్తే.. రోడ్లపైనా, అపార్ట్‌మెంట్లలోకి, షాపుల్లోకి నీరు వెల్లువెలా ముంచెత్తింది. ఈ పరిణామాలన్నీ చూసి.. భూకంపం సంభవించిందా?.. వర్షం ముంచెత్తిందా??.. వరద వెల్లువెత్తిందా???.. అన్న భావనలతో భయాందోళనలతో ఉక్కిరిబిక్కిరయ్యా రు.. అసలు విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్న.. ఆకస్మాత్తుగా ముంచెత్తిన వర ద కాని వరదతో ఆ ప్రాంత ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. రాకపోకలు స్తంభించి వాహనాదారులకు ఇక్కట్లు తప్పలేదు. ఇంతకీ అసలు విషయమేంటంటే.. ఆ శబ్దాలు.. భూ ప్రకంపనలు కావు.. అలాగని వర్షాలు, వరదలూ ముంచెత్తలేదు.. అది తాటిపూడి పైపులైన్‌ పేలుడు.. లీకేజీలు సృష్టించిన తాత్కాలిక ఉపద్రవం.  నాసిరకం నిర్మాణం కారణంగా ఈ పైపులైన్‌కు పగుళ్లు, లీకులు కొత్తేం కాదు. అంచనా వ్యయానికి మించి రూ.81కోట్లకుపైగా ఖర్చు చేసినా.. ఏటా మరమ్మతులకే సగటున రూ.18 లక్షలు ఖర్చు చేస్తున్నా.. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి దెబ్బ కు అవన్నీ లీకేజీ నీళ్లలో కలిసిపోతున్నాయి. ఫలితంగా తరచూ లీకులు, పగుళ్లతో విలువైన నీళ్లు, నిధులు వృథా కావడం.. మరమ్మతులు, నీటిసరఫరా నిలిపివేత  కారణం గా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు నిత్యకృత్యమయ్యాయి.  

లీకులే లీకులు..
2012..    9
2013..    12
2014..    5
2015..    13
2016..    9
2017..    9
2018..    5
2019(ఇప్పటివరకు).. 5

సాక్షి, విశాఖపట్నం: తాటిపూడి పైపులైన్‌ మరో సారి పగిలింది. అడుగుకో అక్రమం, పైపు పైపులో అవినీతి ప్రవాహం సాగడంతో నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాల్సిన పైప్‌లైన్‌కు నిలువెల్లా పగుళ్లు, లీకేజీలే మిగిలాయి. మంగళవారం తెల్లవారుజామున కంచరపాలెం బీఆర్‌టీఎస్‌ రహదారిపై తాటిపూడి పైప్‌లైన్‌ పగిలి పోయి వేల లీటర్ల నీరు వృథా అయ్యింది. ఈ పైపులైన్‌ పగలడం ఇది 67వ సారి. గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన ఈ పైపులైన్‌ దుస్థితికి నిర్మాణంలో అవినీతే కారణమని అధికారులు నివేదికలు ఇచ్చినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు.


పనులు పూర్తిచేయకున్నా.. అదనంగా నిధులు..
విస్తరిస్తున్న విశాఖ నగర భవిష్యత్తు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని 10ఎంజీడీల నీటి సరఫరా చేసేలా తాటిపూడి పైప్‌లైన్‌ నిర్మాణం చేపట్టారు. 2011లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిధులతో విజయనగరం జిల్లా నుంచి తాటిపూడి నుంచి విశాఖ నగరంలోని టీఎస్సార్‌ కాంప్లెక్స్‌ వరకూ సుమారు 63 కిలోమీటర్ల మేర పైప్‌లైన్లు నిర్మించేందుకు రూ.81.28 కోట్లతో ఐహెచ్‌పీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు పనులు అప్పగించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ ప్రకారం రూ.62.28 కోట్లకే పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ జీవీఎంసీ మాత్రం కాంట్రాక్టర్‌కు  మరో రూ.19 కోట్లు పెంచి రూ.81.28 కోట్లు సమర్పించింది. సదరు కాంట్రాక్టర్‌ మాత్రం నిధులు సరిపోవడం లేదంటూ టీఎస్సార్‌ కాంప్లెక్స్‌ వరకు కాకుండా 4 కిలోమీటర్ల ముందు కంచరపాలెం సమీపంలోని గోదావరి పైపులైన్‌కు అనుసంధానం చేసేసి చేతులు  దులిపేసుకున్నాడు. టెండర్‌ నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయకున్నా బిల్లులు మాత్రం చెల్లించేశారు. అలా ఎందుకు చెల్లించారన్న దానికి జీవీఎంసీ అధికారుల వద్ద ఇప్పటికీ సమాధానం లేదు.

పైసలు పోయె.. పగుళ్లు మిగిలె..
కాగా వేసిన 59 కిలోమీటర్ల పైపులైన్‌లోనూ నాణ్యత ఏమాత్రం లేకపోయినా అప్పటి అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం. భారీ పైపులైన్లు వేసినప్పుడు ఇరువైపులా 10 మీటర్ల వరకు వాటిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా జాగ్రత్త వహించాలి. కానీ తాటిపూడి పైపులైన్‌పై ఏకంగా ఫోర్‌లైన్‌ బీఆర్‌టీఎస్‌ రహదారి వెళ్తోంది. దాంతో ఒత్తిడి పెరిగి పైపులు తరచూ పగిలిపోతున్నాయి. అయినా కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా జీవీఎంసీ అధికార యంత్రాంగం మౌనం వహిస్తోంది. పైప్‌లైన్‌పై పలు చోట్ల భవంతులు సైతం వెలిశాయి. పెందుర్తి మార్గంలో  ఎల్‌జీ పాలిమర్స్‌ దాటిన తర్వాత ఆక్రమణలు మొదలయ్యాయి. ఎస్‌ఆర్‌ ఆస్పత్రి ముందు నుంచి పైప్‌ లైన్‌ మీదుగా పెద్ద పెద్ద దుకాణాలు వెలిశాయి. గోపాలపట్నం జంక్షన్‌లో తాటిపూడి ఎయిర్‌పంప్‌పై ఏకంగా ఓ బేకరీనే నిర్మించేశారు. ఇలా ప్రతి చోటా పైపులైన్‌పై ఒత్తిడి పెరుగుతుండటం వల్ల అవి పగిలిపోతున్నాయి. గోపాలపట్నం నుంచి పెందుర్తి వరకూ పైప్‌లైన్‌పై సుమారు 100కి పైగా కట్టడాలు ఉన్నట్లు జీవీఎంసీ అధికారులు గుర్తించి నివేదికలు ఇచ్చినా చర్యలు శూన్యం.

నిర్వహణ అస్తవ్యస్తం..
చిన్నచితకా పనుల విషయంలో నిబంధనల పేరుతో హడావుడి చేసే జీవీఎంసీ ఇంజినీర్లు.. తాటిపూడి కాంట్రాక్టర్‌కు మాత్రం నిర్వహణ విషయంలో మినహాయింపునిచ్చేశారు. 2011 లో ప్రాజెక్టు ప్రారంభమై అదే ఏడాది పూర్తయింది. ఆ తర్వాత ఏడేళ్ల వరకూ అంటే 2018 వరకు కాంట్రాక్టరే నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలి. కానీ అసంపూర్తి పనులు చేసి పూర్తి బిల్లులు తీసుకున్న కాంట్రాక్టు సంస్థ ఆ తర్వాత నిర్వహణ విషయాన్ని గాలికొదిలేసింది. 2012 నుంచే పైపులైన్‌ లీకేజీలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కార్పొరేషనే మరమ్మతు పనులకు నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఏడేళ్లలో సుమారు రూ. 1.10 కోట్లు మరమ్మతులకు ఖర్చు చేసింది. ఆడిట్‌లో అక్రమాలు బట్టబయలు    జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పనులఆడిట్‌లో తాటిపూడి పైప్‌లైన్‌ వ్యవహారం బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో పాటు బిల్లుల చెల్లింపుల విషయంలోనూ అవకతవకలు జరిగాయని తేటతెల్లమైంది. కానీ ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి ఇంజినీర్ల బృందం.. అవకతవకలు జరుగుతున్నా ప్రోత్సహించడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. పైగా తాటిపూడి పైపులైన్‌ నిర్వహణకు  ప్రత్యేకంగా టెండర్లు పిలిపించారు. ఏటా రూ.18లక్షలతో పనులు అప్పగించారు. ఇప్పటికే కాంట్రాక్టర్‌ వల్ల కార్పొరేషన్‌ ఖజానాకు రూ.కోట్లు చిల్లు పడగా.. ఇప్పుడు ఏటా రూ.18లక్షలు చేతి చమురు వదులుకోవాల్సిన పరిస్థితి.

ఆక్రమణలు తొలగించేందుకు ప్రయత్నిస్తాం..
తాటిపూడి పైప్‌లైన్‌ మరమ్మతులు పూర్తయ్యాయి. పారిశ్రామిక అవసరాలకు హెచ్‌పీసీఎల్‌ నీటిని వినియోగించకపోవడం, తాటిపూడి రిజ ర్వాయర్‌ వద్ద ప్రెజర్‌ పెరగడం వల్ల పగులు ఏర్పడిందని అధికారులు ప్రాథమికంగా నిర్థరించారు. పైప్‌లైన్‌ వెంబడి ఆక్రమణలున్నాయని తెలిసింది. వాటిని తొలగించి.. పైప్‌లైన్‌పై ప్రెజర్‌ పడకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తాం. భవిష్యత్తులో ఎలాంటి లీకేజీలు, పగుళ్లు ఏర్పడకుండా పటిష్ట చర్యలు చేపడతాం.
– జి.సృజన, జీవీఎంసీ కమిషనర్‌

యుద్ధప్రాతిపదికన పూర్తి చేశాం.. 
తాటిపూడి పైప్‌లైన్‌ పగలడం వల్ల కేవలం హెచ్‌పీసీఎల్, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్, కోరమండల్‌ పారిశ్రామిక అవసరాలకు మాత్రమే ఎక్కువగా ఇబ్బంది తలెత్తింది. ఎన్‌ఏడీ కొత్త రోడ్డు, పెందుర్తి, తాటిపూడి, వేపగుంట, గోపాలపట్నం, కంచరపాలెం మెట్టు వరకు కొన్ని ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చెయ్యలేకపోయాం. 9 గంటల్లో మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశాం. బుధవారం నుంచి సరఫరా యథాతథంగా ఉంటుంది. పైప్‌ లైన్‌ మరమ్మతులకు సంవత్సరానికి రూ.18 లక్షలు వెచ్చిస్తున్నాం. ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకుంటాం.
– వేణుగోపాల్, ఎస్‌ఈ, జీవీఎంసీ నీటిసరఫరా విభాగం 

బీఆర్‌టీఎస్‌ రహదారిలో ప్రకంపనలు..
కంచరపాలెం(విశాఖ ఉత్తరం): కంచరపాలెం బీఆర్‌టీఎస్‌ ప్రధాన రహదారిలో తాటిపూడి భూగర్భ ప్రధాన పైప్‌లైను మంగళవారం వేకువజామున 4గంటల సమయంలో పెద్ద శబ్దంతో నాలుగు చోట్ల పగిలింది. ఈ ఘటనలో రహదారి పాక్షికంగా దెబ్బ తింది. రాకపోకలు స్తంభించాయి. పైప్‌లైన్‌ నుంచి గంటల పాటు నీరు పొంగి ప్రవహించడంతో స్థానిక దుకాణాల్లోకి, ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌ పూర్తిగా నీట మునిగింది.  అపార్ట్‌మెంటులో నివాసం ఉంటున్న వాచ్‌మెన్‌ శ్రీనివాసరావు వస్తుసామగ్రి పూర్తిగా మునిగిపోయాయి.

 సమీక్షించిన అధికారులు, నాయకులు..
విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్, ఎమ్మెల్యే పి.గణబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. వాచ్‌మన్‌ శ్రీనివాసరావు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించనున్నట్లు మళ్ల విజయప్రసాద్‌ తెలిపారు. కంచరపాలెం సీఐ కృష్ణారావు పరిస్థితి సమీక్షించారు. అటుగా రాకపోకలు సాగిస్తున్న వాహనచోదకులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేశారు. యుద్ధ ప్రాతిపదికన పైప్‌లైన్‌ మరమ్మతులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని జీవీఎంసీ అధికారులు తెలిపారు.

మళ్లీ ఇక్కడే.. : మళ్ల
మూడేళ్ల క్రితం తాటిపూడి పైపులైన్‌ మరమ్మతులకు గురై కంచరపాలెం నుంచి ఐటీఐ కూడలి, ఊర్వశి జంక్షన్‌ వరకు రహదారి పాక్షికంగా దెబ్బ తిన్న సంఘటన మరవకముందే మళ్లీ అదేచోట ఇలాంటి సంఘటన జరగడం బాధకరమని మళ్ల విజయప్రసాద్‌ అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పైప్‌లైన్‌ నిర్వహణలో, నాణ్యత విషయంలో రాజీపడకుండా.. సమస్య పునరావృతం కాకుండ గట్టి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కార్యక్రమంలో జోన్‌–4 జోనల్‌ కమిషనర్‌ సింహాచలం, ఈఈ రాజారావు, విద్యుత్‌ డీఈ నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ వార్డు అధ్యక్షులు కెపి.రత్నాకర్, ముర్రువాణీ నానాజీ, ఆడారి శ్రీను, నాగేశ్వరరావు, నాయకులు కొణతాల ఉమమహేశ్వరరావు, పల్లా ఎర్నికుమార్, చెంగల ఈశ్వరరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు