సంస్కరణలతో పన్నులు తగ్గుతాయి

25 Feb, 2018 00:59 IST|Sakshi

విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

విశాఖపట్టణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాహసోపేతమైన సంస్కరణల వల్ల ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు కనిపించినా దీర్ఘకాలంలో పలు ప్రయోజనాలు చేకూరతాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చెప్పారు. సంస్కరణల వల్ల దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగితే పన్ను రేట్లు దిగొస్తాయన్నారు.

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ భాగస్వామ్య సదస్సును శనివారం విశాఖలో ఉప రాష్ట్రపతి ప్రారంభించి మాట్లాడారు. దేశంలో పన్ను చెల్లించే వారి సంఖ్య 6.74 కోట్ల నుంచి 8.28 కోట్లకు పెరిగిందని, ఇది మరింత పెరిగితే పన్ను రేట్లు కూడా దిగొస్తాయని ఉప రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.సంస్కరణలు, సమర్థవంతమైన నాయకత్వం, స్థిరమైన వృద్ధి రేటుతో దూసుకుపోతున్న భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారని ఉప రాష్ట్రపతి తెలిపారు. వచ్చే పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 2.3 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 10 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవడం ద్వారా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించనుందన్నారు. 

ఏపీ అన్నిట్లో ఎదగాలి: కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు 
 ఆంధ్రప్రదేశ్‌ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు చెప్పారు. ఏపీ పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఉద్యోగ కల్పనలోనూ ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. తూర్పు తీరంలో అతి పెద్ద ఆటో కాంపొనెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోందని, దీన్ని ఏపీలో నెలకొల్పాలన్న వినతిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు