నకిలీ టీసీ గుట్టు రట్టు

13 Oct, 2015 02:02 IST|Sakshi
నకిలీ టీసీ గుట్టు రట్టు

పాస్‌పోర్ట్‌కు నకిలీ టీసీ పెట్టి అడ్డంగా బుక్కయిన అభ్యర్థి
జిల్లా ఎస్పీ విచారణలో వెలుగులోకి.. నిందితుడి అరెస్టు
పలమనేరులోనే ముఠా.. ఇందులో కొందరు టీచర్ల పాత్ర

 
పలమనేరు: పాస్‌పోర్టు కోసం నకిలీ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్(టీసీ) పెట్టి ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. పలమనేరులో సోమవారం ఈ ఘటన  వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఫేక్ టీసీ, కాండక్ట్, స్టడీ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్.. ఇలా ఏది కావాలన్నా తయారు చేసే ఓ ముఠా పలమనేరులోనే ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వివరాలిలా.. పలమనేరు పట్టణంలోని పాతపేటకు చెందిన ఇలియాజ్ ఇటీవల పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అది విచారణ కోసం స్థానిక ఎస్‌బీ(స్పెషల్ బ్రాంచి) విభాగానికి చేరింది. ఎస్‌బీ ఎస్‌ఐ నాగరాజు విచారణలో పలు అనుమానాలు రేకెత్తాయి. ఆయన ఆధ్వర్యంలో ఎస్‌బీ సిబ్బంది సంబంధిత పాఠశాలల్లో విచారణ జరపారు. దీంతో ఆ టీసీ నకిలీదని తేలింది. వెంటనే పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ టీసీల ముఠా గుట్టు ఉన్నట్లు తేలింది. లా అండ్ ఆర్డర్ ఎస్‌ఐ చిన్న రెడ్డెప్ప సోమవారం నిందితున్ని అరెస్టు చేసి స్థానిక కోర్టుకు తరలించారు. ఇక ఈ ముఠా ను పట్టుకునే పనిలో వీరు ఉన్నట్టు సమాచారం.

గురువులే పాత్రదారులు...
నకిలీ ముఠాలో పలమనేరుకే చెందిన అన్వర్ అనే ఉపాధ్యాయుడు కీలకమైన వ్యక్తి అని తెలుస్తోంది. ఇతనితో పాటు మరికొందరు కూడా ఓ ముఠాగా ఏర్పడి ఇప్పటికే పలు టీసీలు, ఇతర సర్టిఫికేట్లను అవసరమైన వారికి తయారు చేసి ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా డ్రైవింగ్ లెసైన్సుల కోసం భారీగానే నకిలీ టీసీలను ఇచ్చినట్టు తెలిసింది. ఇలియాజ్ ఇచ్చిన నకిలీ టీసీ, స్టడీ సర్టిఫికెట్‌లో అతను కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లె హైస్కూల్‌లో చదివినట్టుగా ఉంది. హెచ్‌ఎం రుక్మిణీ సంతకాన్ని వీరు ఫోర్జరీ చేశారు. ఇందుకు కావాల్సిన రౌండ్ సీలు, కోడిగుడ్డు ఆకారపు సీలు, హెచ్‌ఎం సీలును తయారు చేయించి వాటిని ఉపయోగించినట్టు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇలాంటివి ఎన్నింటిని, ఎవరెవరికీ ఇప్పటి దాకా ఇచ్చారు? ఈ ముఠాలోని మొత్తం సభ్యులెందరు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. త్వరలో ఈ నకిలీ టీసీ గురువుల గుట్టు రట్టు కానుంది. మరోవైపు ఫేక్ టీసీలను పెట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
 
 

మరిన్ని వార్తలు