మంత్రి ‘పితాని’పై తమ్ముళ్ల ఆగ్రహం

23 Sep, 2017 03:44 IST|Sakshi

నిన్న పార్టీలోకి వచ్చి మమ్మల్ని వెళ్లిపోమంటారా!?

ఎన్ని రోజులు సమస్యను సాగదీస్తారని నిలదీత

సాక్షి ప్రతినిధి, ఏలూరు/చింతలపూడి : పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ టీడీపీలో కొద్ది నెలలుగా రగులుతున్న అసమ్మతి భగ్గుమంది. ఏలూరు జెడ్పీ గెస్ట్‌హౌస్‌ వేదికగా ఎంపీ మాగంటి బాబు వర్గీయులు మంత్రులను నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన మంత్రి పితాని సత్యనారాయణ.. ‘మీకు చేతనైంది చేసుకోండి’ అని చెప్పడంతో వారిలో ఆగ్రహం రెట్టింపైంది. వివరాల్లోకి వెళ్తే.. చింతలపూడి ఏఎంసీ ఛైర్మన్‌ వ్యవహారంలో మాజీమంత్రి పీతల సుజాత వర్గానికి, ఎంపీ మాగంటి బాబు వర్గానికి గత మూడేళ్లుగా వివాదం నడుస్తోంది. శుక్రవారం చింతలపూడిలో సమన్వయ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇరువర్గాలతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని నిర్ణయించారు. ఇన్‌చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు ఈ బాధ్యతను జిల్లా మంత్రి పితాని సత్యనారాయణకు అప్పగించారు. బాబు వర్గీయులు సమస్యను ఇప్పటికిప్పుడు పరిష్కరించకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరించడంతో పితాని ‘మీ ఇష్టమైంది చేసుకోండి’ అంటూ అసహనం వ్యక్తంచేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు మీరు నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చి మమ్మల్ని రాజీనామా చేసుకోమంటారా అంటూ మంత్రిపై విరుచుకుపడ్డారు.

పేకాడుతున్నా మావాళ్లను అరెస్టు చెయ్యొద్దు
ఈ సమావేశంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ కార్యకర్తలు పేకాట ఆడుతున్నా అడ్డుకోవద్దని పోలీసులకు సూచించారు. ఒకవేళ మీరు కార్యకర్తలను అరెస్టుచేస్తే మళ్లీ మేమే స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది.. గుర్తుంచుకోండని చెప్పడంతో మంత్రులు, పోలీసులు అవాక్కయ్యారు. అనంతరం రాజ్యసభ సభ్యురాలు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాగంటి బాబు వ్యాఖ్యలను పట్టించుకోవద్దని కార్యకర్తలకు సూచించారు.   

మరిన్ని వార్తలు