వైఎస్సార్‌ సీపీకి ఓటేశారని..

20 Apr, 2019 13:02 IST|Sakshi
టీడీపీ కార్యకర్తల చేతిలో దెబ్బలు తిన్న వండాన సరస్వతి, ఆమె అక్క దుర్గమ్మ

దివ్యాంగురాలిపై దాడి

దిక్కులేనివారని పోలీసులు కూడా

పట్టించుకోని వైనం

శ్రీకాకుళం, ఆమదాలవలస: బూర్జ మండలంలోని తోటవాడ గ్రామానికి చెందిన దివ్యాంగురాలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసిందని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు శుక్రవారం ఆమెపై దాడికి దిగి చితకబాదారు. స్థానికులు తెలిపిన వివరాలు.. వండాన సరస్వతి, ఆమె అక్క వండాన దుర్గమ్మ (మూగ) ఇద్దరూ మగదిక్కు లేకుండా తోటవాడ గ్రామంలో నివాసముంటున్నారు.
ఎన్నికల ముందురోజు ఆ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సీపాన ధనుంజయరావు వీరి ఇంటికి వెళ్లి.. టీడీపీకి ఓటు వెయ్యమని ప్రలోభ పెట్టి రూ.1,000 ఇచ్చారు. ఆ డబ్బు వద్దని, తీసుకోమని సరస్వతి వారి మొహం మీద చెప్పినా సరే ఇంట్లో దూరి దేవుడుబల్లపై రెండు రూ.500ల నోట్లు పెట్టేసి వెళ్లిపోయారు.

సరస్వతి ఇంటిపక్కనే ఉన్న కొత్తకోట రమణమూర్తి, ఆయన భార్య సీతామహాలక్ష్మి గురువారం సాయంత్రం దుర్గమ్మను ‘నువ్వు, మీ చెల్లి ఏ పార్టీకి ఓటు వేశార’ని ప్రశ్నించగా మూగదైన దుర్గమ్మ ఫ్యాను గుర్తుకు వేశామని సైగ చేసి చెప్పింది. దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ టీడీపీ దగ్గర డబ్బులు తీసుకొని ఫ్యాను గుర్తుకు ఓటు వేస్తారా అంటూ ఆ అక్కా చెల్లెళ్ల పైకి దూసుకుపోయి చితకబాదారని స్థానికులు చెబుతున్నారు. తాము ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చిత్రహింసలు పెట్టగా.. ‘ఆ డబ్బు మాకు ధనుంజయరావు ఇచ్చాడని, ఆయనకే ఇస్తాన’ని చెబుతూ సరస్వతి ఆ వెయ్యి రూపాయలు తీసుకెళ్లి ఆయనకు ఇచ్చేసింది. అయితే టీడీపీకి ఓటు వెయ్యవా అంటూ రమణమూర్తి, అతని భార్య కలిసి చితగబాదారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బూర్జ మండల కేంద్రంలోగల పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించినా వారు కూడా పట్టించుకోవడంలేదని, పోలీసులు స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు