పామూరులో టీడీపీ నేతల బరితెగింపు

9 Apr, 2019 13:14 IST|Sakshi
నగదు ఉన్న బ్యాగ్‌తో వెళ్తున్న టీడీపీ కార్యకర్త

పంచాయతీ కార్యాలయం కేంద్రంగా నగదు పంపిణీ

సాక్షి, పామూరు (ప్రకాశం): సార్వత్రిక ఎన్నికల్లో ధనబలంతో గెలవాలని భావించిన టీడీపీ నాయకులు ఓటర్లకు ఎరగా నగదు పంపిణీకి సిద్ధమయ్యారు. అందుకు కేంద్రంగా ఏకంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయాన్నే ఎంచుకున్నారు. సోమవారం కొందరు టీడీపీ నాయకులు ఓటర్ల జాబితా, స్లిప్పులు, ట్యాబ్‌లు తీసుకుని పంచాయతీ కార్యాలయానికి వచ్చారు. పంచాయతీ కార్యాలయానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి రాఘవులు రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకలాపాలు ఇక్కడ చేయకూడదని వారికి చెప్పారు.

టీడీపీకి చెందిన మాజీ సర్పంచి ఇక్కడే చేసుకోమని చెప్పాడని ఆ పార్టీ నాయకులు తిరిగి సమాధానం చెప్పారు. రాఘవులు వారిని లోపలే ఉంచి తలుపునకు గొళ్లెం వేశాడు. విషయాన్ని పంచాయతీ కార్యదర్శి రంగయ్యకు చెబుదామనుకుంటే ఆయన అందుబాటులో లేకపోవడంతో పాత్రికేయులకు సమాచారం ఇచ్చారు. పాత్రికేయులు, వైఎస్సార్‌ సీపీ నాయకులతో పాటు పలువురు పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లే సరికే అప్పటికే అక్కడికి చేరుకున్న టీడీపీ నాయకులు సిబ్బంది రాఘవులుపై ఆగ్రహం వ్యక్తం చేసి డోర్‌ గొళ్లెం తీసుకుని హడావుడిగా బయటకు వెళ్లిపోయారు.

ఓటరు జాబితా, నగదు, స్లిప్పుల బ్యాగ్‌తో టీడీపీ నాయకులు పంచాయతీ కార్యాలయం నుంచి పరారయ్యారు. విషయాన్ని తహసీల్దార్‌ వెంకటరత్నం, ఎంపీడీఓ, ఎన్నికల అధికారి రాజారత్నం, ఎస్‌ఐ టి.రాజ్‌కుమార్‌లకు తెలపగా వారు వివరాలు సేకరిస్తున్నారు. ఈవీఎం నమూనాలు సైతం పెద్ద సంఖ్యలో పంచాయతీ కార్యాలయంలో ఉంచారు. పంచాయతీ కార్యాలయానికి వచ్చే వారికి, పింఛన్‌ల కోసం వచ్చే వారికి సైకిల్‌ గుర్తుకు ఓటు వేయమని పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందే ఎన్నికల ప్రచారంతో పాటు ఈ తంతులో భాగస్వాములుగా ఉండటం గమనార్హం. చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు