బాలకృష్ణ పీఏను తరిమేద్దాం

1 Feb, 2017 11:27 IST|Sakshi
బాలకృష్ణ పీఏను తరిమేద్దాం

పీఏకు ఏజెంట్‌గా లేపాక్షి ఎంపీపీ
ఆత్మీయ సమావేశంలో ‘తమ్ముళ్ల’ ఫైర్‌
అసమ్మతివాదులపై వేటుకు రంగం సిద్ధం!


లేపాక్షి : ‘హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు వ్యక్తిగత సహాయకుడి(పీఏ)గా ఉన్న చంద్రశేఖర్‌ (శేఖర్‌) నియోజకవర్గంలోని ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సైతం లంచాలు తీసుకుని అవినీతిలో కూరుకుపోయాడు. ఇలాంటి లంచగొండి పీఏను ఐకమత్యంతో తరిమికొడదామ’ని మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ తదితరులు అన్నారు. మంగళవారం సాయంత్రం లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలోని ఓ తోటలో టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది.
 

( చదవండి : బాలయ్య ఇలాకాలో ముసలం )
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచ్‌లను విస్మరించి వారికి ఇష్టమొచ్చిన వారితో డబ్బు తీసుకుని పనులు చేస్తున్నారన్నారు. లేపాక్షి ఎంపీపీ హనోక్‌ను పీఏ శేఖర్‌ తన ఏజెంటుగా పెట్టుకుని ఇళ్ల మంజూరుకు రూ.25 వేలు, పింఛన్‌కు రూ.2 వేలు, సబ్సిడీ రుణాలు ఇవ్వాలంటే రూ.20 వేల చొప్పున ప్రజలతో వసూలు చేశారని విమర్శించారు. గ్రామాల్లోకి టీడీపీ నాయకులు వెళ్తే ప్రజలు ఉమ్మి వేస్తున్నారని, పార్టీ పరువును, నాయకుల ప్రతిష్టను దెబ్బతీశారని వారు అన్నారు. పార్టీ అధిష్టానం పీఏ శేఖర్‌ను అలాగే కొనసాగిస్తే 20 వేల మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలతో వెళ్లి నిలదీస్తామని హెచ్చరించారు.

సిద్ధు అనే కార్యకర్త మాట్లాడుతూ పీఏకు అనుకూలంగా లేని వారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఓ మాజీ సర్పంచ్‌పై చేయి చేసుకున్నారని, ఓ మాజీ మండల అధ్యక్షుణ్ని ఏ కారణం లేకుండానే పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని చెప్పారు.  శేఖర్‌ ఓ లోఫర్‌ అని మండిపడ్డాడు. తనకు ఎలాంటి అధికారిక పదవి లేకపోయినా పోలీస్‌ కాన్వాయ్‌ పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల సీట్లలో ఆశీనులు కావడం వంటివి చేస్తున్నాడని పలువురు ధ్వజమెత్తారు. 

జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, మాజీ మండల కన్వీనర్‌ మారుతీప్రసాద్, మాజీ ఎంపీపీలు మల్లికార్జున, ఆనంద్‌ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్నా తమపై లేనిపోని కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ నరసింహప్ప, పార్టీ నాయకులు పాపిరెడ్డి, తిమ్మిరెడ్డి, నారాయణప్ప, ఆవులరెడ్డి, నాగలింగారెడ్డి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



సస్పెన్షన్‌ వేటుకు రంగం సిద్ధం!
హిందూపురం అర్బన్‌ :
అసమ్మతివాదులను పార్టీ నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఇటీవల చిలమత్తూరులోని మాజీ సర్పంచ్‌ ఇంట్లో అసమ్మతివాదులు నిర్వహించిన రహస్య సమావేశం, అప్పలకుంటలో సమావేశంతో పాటు మంగళవారం లేపాక్షి మండలంలో జరిగిన సమావేశాల విషయాన్ని పీఏ శేఖర్‌ ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ‘ఆపరేషన్‌ పీఏ’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్నీ ప్రస్తావించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో బాలకృష్ణ తీవ్రంగా స్పందించి అసమ్మతివాదులను పార్టీ నుంచి బహిష్కరించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని ఫోన్‌లో కోరినట్టు విశ్వనీయ సమాచారం. ఎమ్మెల్యే బాలకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు కావడం, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు స్వయాన మామ కావడంతో ఆయన ఆదేశాలను పాటించాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని టీడీపీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది.

ఈ నేపథ్యంలో అసమ్మతివాదులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసే సూచనలు కన్పిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే హిందూపురంలో టీడీపీ బలహీనపడే పరిస్థితి ఏర్పడుతుంది.ఇదిలావుండగా, నియోజకవర్గంలోని పీఏ అనుకూలవర్గీయులు అసమ్మతివర్గంపై వేటు వేయాలని ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులతో సంతకాలు సేకరించి అధిష్టానానికి పంపినట్లు సమాచారం. ఇందులో చిలమత్తూరు మండలంలోని వారిపేర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు