కనిగిరిలో టీడీపీ నేతల బరితెగింపు

12 Apr, 2019 09:49 IST|Sakshi
దొడ్డిచింతలలో తోసుకుంటున్న ఇరుపార్టీల కార్యకర్తలు

ఓటమి భయంతో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడికి యత్నం

సాక్షి, కనిగిరి (ప్రకాశం): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులు ఓటమి భయంతో అనేక చోట్ల గొడవలకు దిగారు. వైఎస్సార్‌ సీపీ బూత్‌ ఏజెంట్లు, నాయకులపై పలుచోట్ల గోడవ పడ్డారు. పామూరు మండలం వీరభద్రాపురంలో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్ల ఫారాలను టీడీపీ నేతలు లాక్కున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు తిరుగబాటు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలో గొడవ రాజుకుంది. ఫారాలు తిరిగి ఇవ్వడంతో పొలింగ్‌ సాగింది. నర్రమారెళ్లలో టీడీపీ నాయకులు రీసైక్లింగ్‌కు చేసేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. నిరసన తెలుపుతూ బయటకు వచ్చేశారు. కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అధికారులు రంగప్రవేశం చేయడంతో సమస్య సద్దుమణిగింది. కొడిగుంపలలో టీడీపీ నాయకులు వైఎస్సార్‌ సీపీ నాయకులపై దాడికి ప్రయత్నించారు.

టీడీపీ అభ్యర్థి ఉగ్ర దౌర్జన్యం
వైఎస్సార్‌ సీపీ నాయకులు, ఎంపీపీ గాయం బలరాంరెడ్డి, అతని తమ్ముడితో టీడీపీ అభ్యర్థి ఉగ్ర గొడవ పడ్డారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు కూడా తిరుగుబాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువురి మధ్య తోపులాటలు జరిగాయి. పోలీసుల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. దొడ్డిచింతలలో టీడీపీ నాయకులు వైఎస్సార్‌ సీపీ నాయకులతో గోడవకు దిగారు. సీఎస్‌పురం మండలం జంగావారిపల్లిలో ఎన్నికల  నిర్వాహణలో ఉన్న పోలీసు అధికారి వైఎస్సార్‌ సీపీ నాయకులే టార్గెట్‌గా వ్యహరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల పట్ల దురుసుగా వ్యవహరించారు. ఇలా అనేక చోట్ల అధికార టీడీపీ నేతలు వైఎస్సార్‌ సీపీ నాయకులపై దాడులకు యత్నం చేశారు.

ఓటమి భయంతోనే..
నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ పట్ల ఓటర్లకు విపరీతమైన అభిమానం ఉండటం.. దానితో పాటు ఏ గ్రామం చూసినా, ఏ బూతు చూసినా వైఎస్సార్‌ సీపీకే ఓట్లు అధికంగా పడుతున్నట్లు నివేదికలు వస్తుండటంతో టీడీపీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఫ్యాను గాలి జోరుగా వీస్తుండటంతో ఓటమి భయంతో..నిరుత్సాహంతో అనేక చోట్ల గోడవలకు పాల్పడే యత్నం చేశారు. దానిని అన్ని చోట్ల వైఎస్సార్‌ సీపీ నాయకులు దీటుగా, తెలివిగా ఎదుర్కొన్నారు.

వైఎస్సార్‌ సీపీ నాయకులపై టీడీపీ నేతల దాడి
కనిగిరి: వైఎస్సార్‌ సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం రాత్రి మండలంలోని దిరిశవంచలో జరిగింది. వివరాలు.. దిరిశవంచలో కొంపల రవి ఇటీవల టీడీపీ నుంచి వైస్సార్‌ సీపీలోకి తన అనుచరగణంతో చేరారు.  ఈక్రమంలో  గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దిరిశవంచలో వైఎస్సార్‌ సీపీకి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. రవిపై కోపం పెంచుకున్న టీడీపీ నాయకులు, బంధువులైన వెంకటరావు, రమణయ్య, రమేష్, చిన వీరయ్య మరి కొందరు కలిసి రవి ఇంటిపైకి వెళ్లి దాడి చేశారు.

కొంపల రవి ఇంట్లో లేని సమయంలో ఘర్షణ జరిగింది. ఈ మేరకు టీడీపీ  నాయకులంతా కలిసి కర్రలు, కతులతో దాడి చేసి రవి తమ్ముడు కొంపల రంగనాయకులను తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో రంగనాయకులు కుడి చెయ్యి మనికట్టు వరకు తెగింది. తీవ్ర రక్తశ్రావం కావడంతో ప్రాథమిక చికిత్స కొసం కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు వెంకట్రావ్, రమణయ్య, రమేష్, చిన వీరయ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. తక్కళ్ల పాడులో కూడా టీడీపీ నేతలు ఓటమి భయంతో  వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై రాళ్లతో దాడి చేశారు.

వైఎస్సార్‌ సీపీ నాయకులపై దాడికి యత్నం
పామూరు: పట్టణంలోని విరువూరు రోడ్డు  269వ బూత్‌ (ఉర్దూ స్కూల్‌)లో ఓటు వేసేందుకు వెళ్లిన తనపై టీడీపీ నాయకులు దూషణలకు దిగి దాడికి యత్నించారని, అదేవిధంగా వైఎస్సార్‌ సీపీకి చెందిన ఓటర్లు ఓటు వేసుకునేందుకు రాగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుసేన్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు ఎస్‌కే ఖాదర్‌బాషా, ఫత్తుమస్తాన్‌ పేర్కొన్నారు. స్థానిక కందుకూరు రోడ్డులోని కార్యాలయంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దూషణలకు దిగి, దాడికి యత్నించిన టీడీపీ నాయకులు అబ్దుల్, హాజీ, గౌస్‌బాషా, ఖాదర్‌మొహిద్దీన్, రజాక్, రహిమాన్, ఖాజావలి, ఆర్‌ఆర్‌ రఫీ, ఎస్‌.రఫీలతో పాటు పలువురిపై స్థానిక పోలీసుస్టేషన్‌లో పిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ నాయకుల చర్యలతో ఓటువేసే అవకాశం లేకుండా పోయినట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుసేన్‌రెడ్డి తెలిపారు.

నాయకుల మధ్య తోపులాట
హనుమంతునిపాడు: తిమ్మారెడ్డిపల్లి పోలింగ్‌ బూత్‌ల వద్ద టీడీపీ, వైఎస్సార్‌ సీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. అదే తరహాలో దొడ్డిచింతలలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగారు. రెండు పార్టీల కార్యకర్తలు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. బండ బూతులు తిట్టుకున్నారు. తిమ్మారెడ్డిపల్లి పోలింగ్‌ బూత్‌లో తండ్రి ఓటునుకుమారుడు వేస్తానని రావడంతో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌ అభ్యంతరం తెలిపారు. టీడీపీ, వైఎస్సార్‌ సీపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది.   

మరిన్ని వార్తలు