టీడీపీ అనుబంధ యూనియన్‌లో చేరాల్సిందే

19 Mar, 2016 01:28 IST|Sakshi
టీడీపీ అనుబంధ యూనియన్‌లో చేరాల్సిందే

తెలుగునాడు ట్రేడ్ యూనియన్ నేతల హెచ్చరిక
సభ్యత్వం తీసుకోకుంటే కార్డులుండవ్.. ఉద్యోగాలుండవ్
అంగన్‌వాడీల సమీక్ష సమావేశం
అనధికారికంగా వచ్చి ప్రసంగాలు

 
మంగళగిరి : అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది.. పార్టీ అనుబంధ ట్రేడ్ యూనియన్‌లో సభ్యత్వం తీసుకోవాల్సిందే..  సభ్యత్వం తీసుకోకుంటే వారిని లక్ష్యంగా చేసుకుని ఇబ్బం దులు పెడతాం.. ఉద్యోగాలు తీసేయిస్తాం.. సభ్యత్వం తీసుకుంటే అన్ని సమస్యలు పరిష్కరిస్తాం.. లేదంటే రేషన్ కార్డులు ఉండవు.. సంక్షేమ పథకాలు ఉండవు’ అంటూ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ నాయకులు అంగన్‌వాడీలను హెచ్చరించారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని ఐసీడీఎస్ సమావేశం హాలులో శుక్రవారం అధికారులు నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభం కాగా మధ్యాహ్నం 2.30 గంటలకు అధికారులు భోజన విరామం ప్రకటించారు. ఇంతలో అంగన్‌వాడీ తెలుగునాడు ట్రే డ్ యూనియన్ నాయకులమని జిల్లా గౌరవాధ్యక్షుడు మద్దిరాల గంగాధర్, జిల్లా అధ్యక్షురాలు కొల్లి లక్ష్మీకుమారి, మంగళగిరి తెలుగు మహిళా నాయకురాలు గుత్తా నందినిచౌదరి నిబంధనలు మీరి సమావేశ మందిరంలోకి వచ్చారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేయడం గమనార్హం! ఇక మైక్ పుచ్చుకున్న నాయకులు టీడీపీ అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీలకు జీతాలు పెంచడంతోపాటు మిమ్మల్ని ఉద్దరిస్తుందని.. అందరూ తెలుగునాడు యూనియన్‌లో సభ్యత్వం తీసుకోవాలని  ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తసాగారు. అధికార పార్టీ యూనియన్‌లో సభ్యత్వం తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవని, తీసుకోనివారిని ఏవిధంగా తొలగించాలో తమకు తెలుసంటూ హెచ్చరించారు. అయినా అంగన్‌వాడీలు సభ్యత్వం తీసుకోం.. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ బయటకు వెళ్లిపోయారు.  భోజనం కూడా చేయనివ్వకుండా వేధిస్తున్నారంటూ బయటకు వచ్చిన అంగన్‌వాడీ మహిళలు సాయంత్రం నాలుగు గంటలకు ప్రాంగణంలోని చెట్ల కింద భోజనం చేశారు.
 
 సీడీపీవో వివరణ..
తెలుగునాడు ట్రేడ్ యూనియన్ సమావేశాన్ని ప్రభుత్వ సమావేశం హాలులో ఎలా అనుమతించారని సీడీపీవో భారతిని ‘సాక్షి’ వివరణ కోరగా తాము నెలవారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. మధ్యాహ్నం భోజన విరామం ప్రకటించి తాను భోజనానికి వచ్చానని సమావేశం గురించి తనకు తెలియదని సమాధానమిచ్చారు.

మరిన్ని వార్తలు