టీడీపీకి సత్తాలేకే బీజేపీతో పొత్తు

8 Apr, 2014 01:28 IST|Sakshi

కృష్ణాయపాలెం (మంగళగిరి రూరల్),  న్యూస్‌లైన్: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ  రానున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడే సత్తా లేక భారతీయ జనతాపార్టీతో పొత్తుపెట్టుకుందని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విమర్శించారు.
 
మంగళగిరి మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)తో కలసి ఆయన సుడిగాలి పర్యటన నిర్వహించారు. కృష్ణాయపాలెంలో బాలశౌరి మీడియాతో మాట్లాడారు. టీడీపీకి సొంతగా పోటీచేసి గెలవగలమనే విశ్వాసమే వుంటే బీజేపీతో పొత్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తాను చేసిన చారిత్రాత్మక తప్పిదం అని గతంలో చంద్రబాబు చెప్పారని, అయితే నేడు ఆ తప్పు ఏమైంది.. ఆయన   విశ్వసనీయత ఏమైంది..  విలువలు ఏమయ్యాయని బాలశౌరి ప్రశ్నించారు.

ప్రజల్లో విశ్వాసం కోల్పో యి  బీజేపీ వారి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు రావడం సిగ్గుచేటన్నారు. రానున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో  వైఎస్సార్ సీపీ దెబ్బకు  ఓడిపోతాననే భయంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తుపెట్టుకున్నారని విమర్శించారు. టీడీపీ బీజేపీల పొత్తుతో  రాష్ట్రంలోని  మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలంతా ఏకమవుతున్నారని.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్‌లను అభిమానించే ప్రతి ఒక్కరూ వైఎస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు.
 
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలంతా గమనిస్తూనే వున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై జగన్‌ను అన్యాయంగా  కేసుల్లో ఇరికించి 16 నెలల పాటు జైల్లో పెట్టినా కడిగిన ముత్యంలా బెయిలుపై బయటకు వచ్చారని ఆయన గుర్తుచేశారు.
 
రానున్న ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ను, ఆయన తనయుడు వైఎస్ జగన్‌ను, విజయమ్మను, షర్మిలను  గుర్తుంచుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో  గెలిపించాలని బాలశౌరి కోరారు.  రానున్న ఎన్నికల్లో  అంతిమ విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు.

>
మరిన్ని వార్తలు