బయటపడిన కాంగ్రెస్‌, టీడీపీ బంధం

18 Jul, 2018 13:06 IST|Sakshi

టీడీపీ అవిశ్వాసానికి కాంగ్రెస్‌ మద్దతు!

సాక్షి, అమరావతి : దేశ దేవాలయం పార్లమెంట్‌ సాక్షిగా తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల లోపాయకారి ఒప్పందం మరోసారి బయట పడింది. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై గత పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 13 సార్లు అవిశ్వాసం పెట్టిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అన్న తెలుగుదేశం అధినేత, పార్టీ నేతలు ఒక్కసారిగా స్వరం మార్చారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్న తరుణంలో కేంద్రం నుంచి వైదొలగి కొత్త నాటకానికి తెరలేపింది. అయితే ఇక్కడే టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు అసలు నాటకాన్ని ప్రారంభించాయి. ఏపీ విభజనకు కారణమైన కాంగ్రెస్‌ పార్టీ, ప్రత్యేక హోదాను చట్టంలో పొందు పరచకుండా నయవంచన చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదాతో పాటు విభజన సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తూ, ప్రజలను, నాయకులను ఏకం చేస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ మద్దతు కోరగా ద్వంద వైఖరి అవలంభించింది.

గత పార్లమెంట్‌ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను నెరవేర్చాలంటూ 13సార్లు అవిశ్వాసం తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టారు. అయితే తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకోవడానికి తెలుగుదేశం ఎంపీలు తమదైన శైలిలో నాటకం రక్తి కట్టించారు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి రభసకు దిగారు. వీటితో పాటు స్పీకర్‌ తమిళనాడు కావేరి విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తమిళనాడు ఎంపీల ఆందోళన సాకుతో వైఎస్సార్‌సీపీ ఇచ్చిన నోటీస్‌ను చర్చకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో సభ సక్రమంగా జరగట్లేదంటూ స్పీకర్‌ సభను వాయిదా వేస్తూ వచ్చారు. వీటన్నింటి వెనుక టీడీపీ, బీజేపీలతో పాటు కాంగ్రెస్‌ హస్తం ఉందని అప్పుడే వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. 

అయితే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే అనూహ్య వింత చోటు చేసుకుంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వారికి మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేలు లేచి నిలబడ్డారు. వారు మద్దతు తెలిపిన అనంతరం చర్చకు ఆమోదం తెలుపుతున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు. మూడు రోజుల్లో చర్చ తేదీని నిర్ధారిస్తామని అన్నారు. పదిరోజుల్లోపు చర్చకు అనుమతిస్తామని స్పీకర్‌ తెలిపారు. గత సమావేశాలు దాదాపు నెలరోజుల పాటు జరిగినా, ఒక్క రోజు కూడా స్పీకర్‌ చర్చకు అనుమతించలేదు. పైగా సభ ఆర్డర్‌లో లేదంటూ వాయిదా వేస్తూ వచ్చారు. గత సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాలపై ద్వంద వైఖరి వహించిన కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీకి మాత్రం సంపూర్తిగా మద్దతు తెలపడం విశేషం. ఇలా మూడు పార్టీలు తమ లోపాయకారి ఒప్పందాన్ని అనుకున్న విధంగా అమలు చేసి ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను తుంగలో తొక్కేశారు.

మరిన్ని వార్తలు