వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి

13 Jul, 2019 09:31 IST|Sakshi
వైసీపీ నాయకుడు పీవీ రావుకు వినతిపత్రం అందిస్తున్న కోమటిలంక గ్రామస్తులు 

సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : అధికారం కోల్పోయిన టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. శుక్రవారం టీడీపీ ఏలూరు మండల అధ్యక్షుడు నేతల రవి, కాట్లంపూడి టీడీపీ గ్రామ నాయకుడు కోడే రామకృష్ణ 30 మందితో కలిసి వెళ్లి కోమటిలంకలో చేపల సాగు చేపట్టారు. దీన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు అడ్డుకోవడంతో టీడీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలైన మద్దుల రత్నయ్య, పెనుగొండ ఇమ్మానుయేలు, పి.మధు, పి.తంబి తదితరులపై దాడి చేశారు. దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలు ఏలూరు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదే సమయంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు తరలిరావడంతో కోమటిలంక గ్రామస్తులు భయంతో ఏలూరు ఎంపీ కార్యాలయం వద్ద తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పీవీ రావు కోమటిలంక గ్రామస్తులను కలుసుకుని దాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు అధికారం అడ్డం పెట్టుకుని ఐదేళ్ల పాటు కోమటిలంక ప్రజల భూమిని ఆక్రమించి అక్రమంగా చేపల చెరువులు తవ్వుకుని సొమ్ము చేసుకున్నారని గుర్తు చేశారు. నేడు అధికారం కోల్పోయినప్పటికీ భూముల ఆక్రమణ మానుకోలేదన్నారు. ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు తెగబడడం అన్యాయమన్నారు. కోమటిలంక గ్రామ పరిధిలో ఉన్న చేపల చెరువులు గ్రామస్తులకు చెందుతాయన్నారు.

టీడపీ నాయకుల దాడుల నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, కొల్లేరు ప్రజలను రక్షిస్తామన్నారు. ఇకనైనా టీడీపీ నాయకులు కొల్లేరు ప్రజల భూములపై పెత్తనం మానుకోవాలలన్నారు. లేదంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అనంతరం పీవీ రావు ఏలూరు డీఎస్పీ వెంకటేశ్వరరావుకు ఫోన్‌ చేసి టీడీపీ నేతల దాడుల గూర్చి వివరించి కోమటిలంక గ్రామస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం  గ్రామస్తులను వారి ఊరు వరకూ సాగనంపారు. మరోపక్క టీడీపీ నేతలు సైతం కోమటిలంక గ్రామస్తులపై ఫిర్యాదు చేశారు. 

మరిన్ని వార్తలు