విద్యార్థులు, యువతపై టీడీపీ దాడులు

26 Jan, 2020 05:05 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ నాయకులపై దాడి చేస్తున్న టీడీపీ నాయకులు (ఇన్‌సెట్‌లో) టీడీపీ దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ నేత గోపీకృష్ణ

తెనాలిలో వైఎస్సార్‌సీపీ నేతకు తీవ్ర గాయాలు

కుప్పంలో విద్యార్థులపై మూకుమ్మడి 

దాడికి తెగబడిన టీడీపీ శ్రేణులు

తెనాలి అర్బన్‌/కుప్పం: పాలన వికేంద్రీకరణ బిల్లుకు అడ్డు పడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ తీరుకు నిరసనగా విద్యార్థులు, యువకులు గుంటూరు జిల్లా తెనాలి, చిత్తూరు జిల్లా కుప్పంలో శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీలపై టీడీపీ శ్రేణులు శనివారం దాడులకు తెగబడ్డాయి. తెనాలిలో వైఎస్సార్‌సీపీ నేత ఒకరు తీవ్రంగా గాయపడగా, రెండుచోట్లా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో టీడీపీ అడ్డుకోవటాన్ని నిరసిస్తూ శనివారం వైఎస్సార్‌ సీపీ, యువజన విభాగం, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెనాలిలోని లింగారావు సెంటర్‌లో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్కడి నుంచి విద్యార్థులు, యువకులు ర్యాలీగా మార్కెట్‌ వద్దకు చేరుకోగా.. అక్కడ దీక్ష చేపట్టిన టీడీపీ శ్రేణులు అమరావతికి మద్దతుగా నినాదాలు చేస్తు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.

ముఖ్యమంత్రిని అనుచిత వ్యాఖ్యలతో దూషించటంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు చంద్రబాబు, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంలో టీడీపీ నాయకులు వైఎస్సార్‌ సీపీ నాయకులపైకి దూసుకొచ్చి తోపులాటకు దిగారు. పోలీసు అధికారులు రోప్‌లు ఏర్పాటు చేసి ఇరువర్గాల వారిని పక్కకు పంపారు. ఇంతలో టీడీపీ శ్రేణులు కోడిగుడ్లు, టమోటాలతో వైఎస్సార్‌ సీపీ నాయకులపై దాడి చేశారు. ఈ గొడవ నడుస్తుండగానే గుర్తు తెలియని వ్యక్తి టీడీపీ దీక్ష శిబిరానికి నిప్పు పెట్టగా.. టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు చుండూరు గోపీకృష్ణపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చికిత్స పొందుతున్న అతడిని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ పరామర్శించారు. 

ద్రవిడ యూనివర్సిటీలో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు
కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై టీడీపీ శ్రేణులు శనివారం దాడికి పాల్పడ్డాయి. వికేంద్రీకరణ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వర్సిటీ విద్యార్థులు శాంతియుత ర్యాలీ చేపట్టగా.. ఒక్కసారిగా టీడీపీ నాయకులు దూసుకొచ్చారు. సీఎం వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, విద్యార్థులను, వైఎస్సార్‌సీపీ నాయకులను చుట్టుముట్టి పిడిగుద్దులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి.

మరిన్ని వార్తలు