మునిగిపోయే పడవ టీడీపీ

13 Feb, 2016 01:17 IST|Sakshi
మునిగిపోయే పడవ టీడీపీ

చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ఉండటం దౌర్భాగ్యం
 అన్నం తినే ఎమ్మెల్యేలెవరూ ఆ పార్టీలోకి వెళ్ళరు...
 తెలంగాణ లో దెబ్బతిన్న బాబు మైండ్‌గేమ్ ఆడుతున్నారు
 రాజకీయ జీవితం ఉన్నంత వరకూ జగన్ వెంటే ఉంటాం
 విలేకరులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు

 

సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మునిగిపోయే పడవలాంటిదని, అందులో ఎక్కాలని ఎవరూ అను కోరని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. గుంటూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తుండడం మన దౌర్భాగ్యమని అన్నారు. అన్నం తినే ఎమ్మెల్యేలెవరూ ఆ పార్టీలో చేరాలనుకోరని ఘాటుగా విమర్శలు గుప్పించారు. కొన్ని ఛానళ్లు, పత్రికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళుతున్నారనే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  వైఎస్సార్ సీపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా టీడీపీలో చేరరని, చంద్రబాబు కులాల మధ్య చిచ్చు రగులుస్తున్నారని మండిపడ్డారు. గతంలో మాదిగ, మాలల మధ్య చిచ్చు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు బీసీలు, కాపుల మధ్య వైషమ్యాలు రేపుతున్నారని ఆరోపించారు. గుంటూరు నుంచి ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు    తమ పార్టీలోకి వస్తున్నట్లు టీడీపీ అబద్ధపు, మోసపూరిత ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

 వందలాది వాగ్దానాలు ..ఒక్కటీ నెరవేర్చలేదు
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ ముఖ్యమంత్రి కుర్చీ కోసం చంద్రబాబు వందల వాగ్దానాలను చేసి సీఎంగా ప్రమాణం చేసిన తరువాత ఒక్కటీ నెరవేర్చలేదని మండి పడ్డారు. ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవడంతో ఆందోళనలో ఉన్న చంద్రబాబు ప్రజల దృష్టిని మరల్చేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.

 రాజకీయ జీవితం ఉన్నంత వరకు    జగన్ వెంటే...
నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ జీవితం ఉన్నంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటానని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్న  తెలుగుదేశం పార్టీ నేతలు ఏం చూసి ఆ పార్టీలోకి రావాలో చెప్పాలని ప్రశ్నిం చారు. రాజధాని రైతులు భూములు ఇచ్చినందుకు బాధపడుతున్నారని, తెలంగాణాలో టీడీపీ చాప చుట్టేసిందన్నారు.

 ఓడిపోయిన వారికి పెత్తనం ...
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం  చేస్తున్నారని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మండి పడ్డారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లను పక్కన పెట్టి జన్మభూమి కమిటీల పేరుతో ఓడిపోయిన ఆ పార్టీ నాయకులకు పెత్తనం అప్పజెప్పి ఇష్టానుసారం జీవోలు ఇచ్చుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ ప్రలోభాలకు తలొగ్గి ఆ పార్టీలోకి వెళ్ళేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఎవరూ సిద్ధంగాలేరని, అలా వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

వైఎస్సార్ పేరుతో స్థాపించిన పార్టీని వదలం
 దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరుతో స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వదలమని, అందులో కొనసాగుతూ జగన్ నాయకత్వంలో పనిచేస్తానని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా స్పష్టం చేశారు. జగన్ కూడా చంద్రబాబులా తప్పుడు వాగ్దానాలు చేస్తే అధికారంలోకి వచ్చి ఉండేవారని, అయితే మాట ఇస్తే తప్పని వ్యక్తిత్వం ఉన్న నాయకుడిని వదిలి ఇతర పార్టీల్లోకి వెళ్లడానికి ఎవరూ సిద్ధంగా లేరని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఉన్నారు.
 

మరిన్ని వార్తలు